
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వరుస షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను లాక్ చేసిన ట్విట్టర్ తాజాగా ఆ పార్టీ అధికారిక ఖాతాతోపాటు పలువురు సీనియర్ నేతల అకౌంట్లను బ్లాక్ చేసి దుమారం రేపింది.
రాహుల్ గాంధీ ట్వీట్ ను రీట్వీట్ చేసిన కాంగ్రెస్ నేతలు రణ్ దీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, మాణిక్యం ఠాకూర్, సుస్మిత దేవ్ , కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ అకౌంట్లను లాక్ చేశారు. తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఖాతాలను నిలిపివేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది.
అయితే ట్విట్టర్ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని నిప్పులు చెరుగుతున్నారు.ప్రధాని మోడీకి అనుకూలంగా ట్విట్టర్ పనిచేస్తూ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తోందని విరుచుకుపడుతున్నారు.
గతంలో బీజేపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని ట్వీట్లు చేసినా చర్యలు తీసుకోని ట్విట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఖాతాలను నిలిపేసి ప్రజల వాయిస్ వినిపించకుండా చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-తాజా ట్విట్టర్ చర్యలకు కారణమిదీ..
ఢిల్లీలో 9 ఏళ్ల దళిత బాలికపై దుండగులు అత్యాచారం చేశారు. తాజాగా రాహుల్ గాంధీ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. బాలికకు న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రుల కన్నీళ్లు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై జాతీయ పౌరహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ క్రమంలోనే ట్విట్టర్ రాహుల్ గాంధీతోపాటు దీన్ని షేర్ చేసిన కాంగ్రెస్ నేతల ట్వీట్టర్ ఖాతాలను నిలిపివేసింది. ట్విట్టర్ చర్యను శశిథరూర్ సహా కాంగ్రెస్ సీనియర్లు ఖండిస్తున్నారు. ప్రశ్నించకూడదా? అని ట్విట్టర్ పై మండిపడుతున్నారు.