HomeNewsCrop Insurance Scheme: ఇంతటి బంగారు తెలంగాణలో రైతుల కన్నీళ్లు తుడిచే పాలసీ లేదా?

Crop Insurance Scheme: ఇంతటి బంగారు తెలంగాణలో రైతుల కన్నీళ్లు తుడిచే పాలసీ లేదా?

Crop Insurance Scheme: “మాట్లాడితే రైతుబంధు ఇస్తున్నాం, రైతు బీమా అమలు చేస్తున్నాం ఇంతకు మించిన రైతు అనుకూల సర్కారు ఎక్కడ ఉన్నది” అని కెసిఆర్ ప్రశ్నిస్తాడు గాని.. అసలు ఆ రైతుబంధు స్కీం కోసం ఎన్ని పథకాలు బొంద పెట్టాడో చెప్పడు. యంత్ర లక్ష్మీ పథకం కాల గర్భంలో కలిసిపోయింది. రైతులకు రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు. విత్తనాల రాయితీ కనుమరుగయింది.. రాయితీ మీద సూక్ష్మ సేద్య పరికరాలు ఎప్పుడో గాయబ్ అయిపోయాయి. మీడియా బలంగా లేకపోవడం, ప్రతిపక్షాలు సరైన దిశలో వెళ్లకపోవడం వల్ల కెసిఆర్ ఆటలు సాగుతున్నాయి కానీ.. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

ఒక విధానం అంటూ లేదు కదా

అకాల వర్షాలు కురుస్తున్నాయి.. రైతుల కళ్ళల్లో కడగండ్లను మిగుల్చుతున్నాయి. ఇలాంటప్పుడు రైతులకు కావాల్సింది సర్కారు భరోసా. కానీ బంగారు తెలంగాణలో అదే దక్కడం లేదు. చేతికొచ్చిన పంట కళ్ళముందే వర్షాల వల్ల సర్వనాశనం అయితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇచ్చే పరిహారంలోనూ కొర్రీలు విధిస్తోంది. ముప్పయి మూడు శాతం పంట నష్టపోతేనే పరిహారం ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది.. అసలు ఇంతటి దుస్థితికి ప్రధాన కారణం పంటకు బీమా లేకపోవడమే. పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడమే. ఇప్పుడు మాత్రమే కాదు గత మూడు సంవత్సరాలుగా రైతులు వరుసగా పంటలు నష్టపోతూనే ఉన్నారు. రైతుబంధు ఇస్తున్నామని ఒకే ఒక కారణంతో బీమా సహా వ్యవసాయ అనుబంధ పథకాలు మొత్తం ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అంతేకాదు కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా వద్దనుకొంది.

నినాదాలకే పరిమితం

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని భారత రాష్ట్ర సమితి ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ, స్వరాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుకు ధీమా ఇచ్చే బీమా పథకం ఒకటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకం లోప భూయిష్టంగా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం దాని నుంచి పక్కకు తప్పుకుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గడ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు సొంతంగా గ్రాఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలు మెరుగ్గా ఉన్నాయని, అక్కడ అధ్యయనం చేసి రావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించారు. వచ్చిన తర్వాత అంతకంటే మెరుగైన పథకాన్ని ఇక్కడ అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత అసలు పంటల బీమా పథకం ఊసే ఎత్తడం లేదు. అటు కేంద్ర పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంతంగా ఎటువంటి పథకానికి రూపకల్పన చేయలేదు. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అనే సామెత తీరుగా రైతుల పరిస్థితి మారింది.

27,500 కోట్ల పంట నష్టం

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటివరకు 27,500 కోట్ల పంట నష్టం జరిగింది. అకాల వర్షాల వల్ల ఏటా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు కోట్లల్లో నష్టపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఏడాది కావడంతో వారం రోజుల్లోనే పట్ట నష్టపరిహారం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల దాటినా కూడా ఇంతవరకు రైతుల ఖాతాలో పరిహారం తాలూకు పైసలు పడలేదు. మరోవైపు పంటల బీమా పథకాలు కూడా లోప భూయిష్టంగా ఉన్నాయి. రైతులు చెల్లించే ప్రీమియంతో పోలిస్తే రైతులకు కలిగే ప్రయోజనం చాలా తక్కువగా ఉంది. రైతులకు ఎలా మేలు చేయాలి అనే దానికంటే.. బీమా పరిహారం అందకుండా ఎలా చూడాలి అనే తరహాలోనే నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ క్రమంలో పంట నష్టం శాతానికి అనుగుణంగా పరిహారం అందితే రైతులకు మేలు కలుగుతుంది. అలాగే, మండలం యూనిట్ గా తీసుకొని క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ అమలు చేయడంతో రైతులకు మేలు కలగడం లేదు. దీంతో గ్రామం యూనిట్ గా తీసుకొని పంటల బీమా పథకాలు అమలు చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి

ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ సర్కార్ “బంగ్లా సస్య బీమా యోజన” అనే పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అక్కడ రైతులకు భరోసా ఇస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్న గ్రాఫ్ ఇన్సూరెన్స్ పథకాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని రైతు సంఘాలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం తమదే రైతు అనుకూల ప్రభుత్వమని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతు బీమా, రైతుబంధు, విద్యుత్ పథకాలు అమలు చేస్తామని డబ్బాలు కొడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో రైతులకు అసలు ఏ సమస్యలు కూడా లేవని ఇటీవల మహారాష్ట్రలో జరిగిన సమావేశంలో చెప్పడాన్ని రైతులు తీవ్రంగా దెబ్బ పడుతున్నారు. తెలంగాణ మోడల్ అంటే ఆ మూడు పథకాలు మాత్రమే కావని, వాటితో తమ కష్టాలు ఏమాత్రం తీరడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular