https://oktelugu.com/

AP Pensions: పోలింగ్ కు ముందు పింఛన్ల పై రగడ.. మరి ఇప్పుడా సమస్య ఏమైందంటే?

మే నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ పింఛన్ల కోసం తిరిగిన 33 మంది వృద్ధులు చనిపోవడంతో వివాదంగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 28, 2024 / 02:39 PM IST

    AP Pensions

    Follow us on

    AP Pensions: జూన్ 1 సమీపిస్తోంది. అధికార,విపక్షాల నుంచి ఎటువంటి ప్రకటన రావడం లేదు. ప్రభుత్వం సైతం స్పందించడం లేదు. దీంతో 60 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో జరిగిన రగడ అంతా కాదు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడయ్యింది. అయితే ఎన్నికల దృష్ట్యా వలంటీర్ల సేవలను పక్కన పెట్టాలని ఈసీ డిసైడ్ అయ్యింది. దీంతో ఇంటింటా పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏప్రిల్ మొదటి వారం వరకు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ జరిగింది. మే నెల విషయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికర పరిణామం ఎదురైంది. ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది తక్కువగా ఉండడంతో ఇంటింటా.. పింఛన్ల పంపిణీ చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే వైసిపికి ప్రయోజనం చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ప్రకటన చేశారని అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి.

    మే నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ పింఛన్ల కోసం తిరిగిన 33 మంది వృద్ధులు చనిపోవడంతో వివాదంగా మారింది. వాలంటీర్లపై చంద్రబాబు విషం చిమ్మారని… ఆయన ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే ఇంటింటా పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగా పింఛన్ల పంపిణీలో జాప్యం చేశారని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు తిరిగి ఆరోపణలు చేశారు. అధికార, విపక్షాల మధ్యఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. ఎలాగోలా పింఛన్ల పంపిణీ పూర్తయింది.

    అయితే ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంటింటికి పంపిణీ చేస్తారా? సచివాలయాల వద్ద అందిస్తారా? లేకుంటే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలకు ముందుగానే అధికార, విపక్షాలు దీనిపై స్పందించాయి. కానీ ఆ రెండు నెలలతో పోల్చుకుంటే ఇప్పుడు వాటి స్పందన అంతంత మాత్రమే. ఎందుకంటే అప్పటికి పోలింగ్ సమయం ఉండేది. ఇప్పుడు పోలింగ్ పూర్తయ్యింది. అందుకే పింఛన్లు పంపిణీ కోసం ఎవరూ పట్టించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. 60 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సిఎస్ జవహర్ రెడ్డి ఎటువంటి ప్రకటన చేయలేదు. పోనీ వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని పంపించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సచివాలయాల ద్వారా అందిస్తారు అంటే అది కుదరని పనిగా ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి అయితే మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పింఛన్ల పంపిణీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో చూడాలి.