Jammu and Kashmir Elections : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం తగ్గు ముఖం పట్టింది. నకిలీ నోట్ల ముఠా వెనక్కి వెళ్ళింది. లోయలో అక్రమ వలసలు తగ్గాయి. ఇవన్నీ కూడా మా పాలన ఘనత వల్లేనని బిజెపి చెబుతోంది. త్వరలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించేందుకు బిజెపి రంగంలోకి దిగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్లో ఎన్నికలను పురస్కరించుకొని సెప్టెంబర్ 18న ప్రచారం నిర్వహించనున్నారు. షేర్ – ఏ – కాశ్మీర్ పార్క్ వద్ద నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. మోడీ ప్రచారం నేపథ్యంలో.. భారీగా జన సమీకరణ చేసేందుకు బిజెపి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది..” జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో భాగంగా నరేంద్ర మోడీ నిర్వహించే ప్రచారం ప్రత్యేకంగా నిలిచిపోనుంది. పార్టీ కార్యకర్తలు నిర్వహించే ఈ ర్యాలీ కీలక ఘట్టంగా నిలవనంది. ఇది బిజెపి ఉనికిని బలపేతం చేయడంలో, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవడంలో తోడ్పడుతుంది. ఇది కీలకమైన అడుగుగా నిలిచిపోతుందని” బిజెపి నాయకులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు శ్రీనగర్లోని బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్చార్జ్ రామ్ మాధవ్, బిజెపి ప్రధాన కార్యదర్శి అశోక్ కౌల్, బిజెపి శ్రీనగర్ జిల్లా అధ్యక్షుడు అశోక్ భట్ సమావేశమయ్యారు. జనాన్ని సమీకరించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.. ఈ సమావేశానికి బిజెపి జమ్మూ కాశ్మీర్ ప్రచార ఇంచార్జ్, మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, ఉప ఎన్నికల ప్రచార ఇంచార్జి మనీష్ శర్మ, మాజీ ఎమ్మెల్సీ సురిందర్, జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ, మాజీ ఎమ్మెల్సీ చరణ్ జిత్ సింగ్ ఖాల్సా పాల్గొన్నారు. ” జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఈ ప్రాంతంలో భారీ వర్తనాత్మక పురోగతిని తీసుకొస్తుంది. ఇది బిజెపి సంకల్పం కూడా. ఆయన ప్రసంగం ఓటర్లలో విశ్వాసాన్ని కలిగిస్తుంది.. అభివృద్ధి – కేంద్రీకృత ఎజెండాను నిర్వహించడంలో పార్టీ నిబద్ధతను స్పష్టం చేస్తుందని” బిజెపి నాయకులు అంటున్నారు. కాగా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.
ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్.. ఇతర పార్టీలు స్పందించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ప్రశ్నించాయి..” మార్పు చేశామని చెబుతున్నారు. గొప్పగా తీర్చిదిద్దామని అంటున్నారు. ఇంత చేసినప్పుడు పండిట్లు ఎందుకు తిరిగి జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి తిరిగి రాలేకపోతున్నారు. పైగా వారిపై దాడులు జరుగుతున్నాయి. దీనికి బిజెపి సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ నోరు విప్పాలి. ఉగ్రవాదాన్ని ఏ ప్రభుత్వం కూడా సహించదు. కానీ ప్రతిపక్షాలు ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్నాయని చెప్పడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా ఇస్తానని అన్నారు. తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాలి.. మాపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. చేసిన పని చెప్పుకోమంటే మా మీద విమర్శలు చేయడం ఏంటి? బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము ప్రజల సమస్యలను ప్రస్తావిస్తాం. అది వినే ఓపిక లేనప్పుడు మేం మాత్రం ఏం చేయగలుగుతామని” ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. నరేంద్ర మోడీ పర్యటన కేవలం ఎన్నికల మ్యాజిక్ మాత్రమేనని..క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తెలుసని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు.