School Fee : ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వని విద్యాసంస్థల యాజమాన్యాలను చూశారు. పరీక్ష రాయనివ్వని ప్రైవేటు విద్యా సంస్థలను చూశాం. కానీ ఇక్కడ ఫీజు కట్టలేదని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ అత్యుత్సాహం చూపించాడు. బాలికను బస్సులో నుంచి నడి రోడ్డుపై దింపేశాడు. ఈ ఘటన తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగింది.
జరిగిందంటే..?
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన ఓ విద్యార్థిని శుభోదయం పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. నిత్యం ఇంటి నుంచి బడికి పాఠశాల బస్సులో వెళ్లి వస్తోంది. రోజులాగానే శుక్రవారం బడికి వెళ్లింది. స్కూల్ బస్సులో ఎక్కిన విద్యార్థిని కొంత దూరం వెళ్లాక డ్రైవర్ ఫీజు కట్టలేదని రోడ్డుపై దింపేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని చిన్నారి అక్కడే నిలబడిపోయింది. బాలిక ఒక్కతే ఏడుస్తూ ఉండిపోయింది. అటువైపుగా వెళ్తున్న వారు బాలికను ఏమైందని ప్రశ్నించారు. జరిగిన విషయం చెప్పగా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు వచ్చి పాపను ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై అటు తల్లిదండ్రులతోపాటు ఇటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాజమాన్యం తీరుపై ఆగ్రహం..
తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పేదలంతా ధనవంతులయ్యారని చెబుతారు అమాత్యులవారు. మరి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఫీజు కోసం ఇలా విద్యార్థులను మధ్యలోనే బస్సు దింపేయాలని ఆదేశించడం ఏమిటని సా‍్థనికులు ప్రశ్నిస్తున్నారు. ఫీజులు కట్టమని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన చెప్పాలే కానీ.. ఇలాంటి పనులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలే తెలంగాణలో ఆడ పిల్లలకు భద్రత కరువైంది. ఇప్పటికే కేటీఆర్ నియోజకవర్గంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇలాంటి చర్యలకు దిగితే అమ్మాయిలకు ఏం భద్రత ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లకు ఫీజుతో సంబంధం ఏమిటని నిలదీస్తున్నారు. ఈ విషయమై డ్రైవర్లను ప్రశ్నిస్తే.. ఫీజు కట్టని పిల్లలను బస్సుల్లో ఎక్కనివ్వకూడదని యాజమాన్యాలు ఆదేశిస్తునా‍్నయని, అందుకే తాము ఎక్కించుకోవడం లేదని, ఒకవేళ పిల్లలు ఎక్కినా మధ్యలో దింపేస్తున్నామని చెబుతున్నారు.
ఇటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలోనే ఇలా జరగడం దారుణం అని పలువురు అంటున్నారు. ఇదే విషయం మంత్రి కేటీఆర్ స్పందించాలని జిల్లావాసులుతోపాటు తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శుభోదయం పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.