Tesla Car Price India: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు నేడు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో తన మొదటి షోరూమ్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. ఈ లాంచ్‌తో భారతీయ ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు. టెస్లా తన మొదటి మోడల్‌గా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ మోడల్ వైని భారతదేశంలో విడుదల చేసింది. అయితే, ఈ కారు ధర వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
వచ్చే నెల నుంచి టెస్లా కార్లు మన రోడ్ల మీద తిరగనున్నాయి. మోడల్ వై కారు ధర ఇండియాలో రూ.67.89 లక్షలుగా ఉంటే, అమెరికాలో రూ.32.18 లక్షలుగా ఉంది. దీంతో ఇంత ధర పెట్టి మన దేశంలో ఆ కార్లను కొంటారా? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఆ కార్లు మన రోడ్లు, పరిస్థితులకు మ్యాచ్ అవుతాయా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇంత ధర ఉండడానికి కారణం దిగుమతి సుంకం, ట్యాక్సులతో రేటు దాదాపు రెండింతలు అయింది.
Also Read: Tata Mahindra Tesla: టెస్లా రాకతో టాటా, మారుతి, హ్యూందాయ్, మహీంద్రా పై ఎఫెక్ట్ ఎంత?
వాస్తవానికి టెస్లా మోడల్ వై బేస్ వేరియంట్ రియర్-వీల్ డ్రైవ్ ధర భారతదేశంలో సుమారు రూ.60 లక్షలుగా ఉంది. అయితే, ఇదే కారు అమెరికాలో సుమారు 38,000డాలర్లు (సుమారు రూ.31.5 లక్షలు) ధరకే లభిస్తోంది. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్ లాంగ్ రేంజ్ ధర భారతదేశంలో సుమారు రూ.68 లక్షలు ఉండగా, అమెరికాలో ఇది కేవలం 50,000డాలర్లు (సుమారు రూ.41.5 లక్షలు) ధరకే దొరుకుతుంది. ధరలో ఇంత డిఫరెన్స్ అనేది కస్టమర్లను నిరాశకు గురి చేస్తుంది.
భారతదేశంలో టెస్లా కార్ల ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దిగుమతి సుంకం. మన దేశంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారీగా ఇంపోర్ట్ ట్యాక్స్ విధిస్తారు. ఒక కారు విలువ 40,000డాలర్ల కన్నా తక్కువ ఉంటే 70శాతం పన్ను, 40,000డాలర్ల కన్నా ఎక్కువ ఉంటే 100% పన్ను విధిస్తారు. టెస్లా మోడల్ వై ధర 40,000డాలర్ల కన్నా ఎక్కువ కాబట్టి, దానిపై 100% దిగుమతి సుంకం విధించారు. అంటే, ఒక కారు విలువ రూ.30 లక్షలు అయితే, దానిపై రూ.30 లక్షల ట్యాక్స్ పడుతుంది. ఇందుకు మళ్లీ ఎక్స్ ట్రాగా జీఎస్టీ, ఇతర పన్నులు కూడా ఉంటాయి.
Also Read: Tesla Mumbai Showroom: ఎట్టకేలకు ఇండియాలో టెస్లా.. ముంబైలో షోరూం స్పెషాలిటీ ఇదే
టెస్లా ప్రస్తుతం తన కార్లను చైనాలోని షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి పూర్తిగా తయారైన కార్లను భారతదేశానికి దిగుమతి చేస్తోంది. దీనివల్ల ఎక్కువ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోంది. టెస్లా తన కార్లను భారతదేశంలోనే అసెంబుల్ చేయడం లేదా తయారు చేయడం గనుక ప్రారంభిస్తే ఈ ధరలు తగ్గుతాయి. లేకపోతే ఇంతే ధరలను పెట్టి కొనుగోలు చేయక తప్పదు. టెస్లా కేవలం ఒక కారు కంపెనీ మాత్రమే కాదు, అది ఒక టెక్నాలజీ బ్రాండ్ కూడా. దాని కార్లలో ఉన్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ, ఆటోపైలట్, సెంట్రల్ టచ్‌స్క్రీన్, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు దాని ధరను మరింత పెంచేస్తున్నాయి.
దిగుమతి సుంకం వల్ల ఇండియాలో టెస్లా కార్లు ధర పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వారికి సుంకాల కథ తెలియక మస్క్ మామ దోపిడీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం టెస్లా ధర ఇండియాలో డబుల్ కావడంతో దీనిపైనే హాట్ హాట్ సెటైర్లు మీమ్స్ ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.