Akbaruddin Owaisi: తెలంగాణ ప్రొటెం స్పీకర్‌ ఖరారు.. కేసీఆర్‌ గాయపడడంతో ఆయనకు ఛాన్స్‌!

తెలంగాణ శాసనసభ నూతన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యవహరించనున్నారు. అక్బరుద్దీన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అత్యధికంగా 8 సార్లు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Written By: Raj Shekar, Updated On : December 8, 2023 3:45 pm

Akbaruddin Owaisi

Follow us on

Akbaruddin Owaisi: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 9 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణం చేయన్నారు. అయితే ప్రమాణం చేయించడానికి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేసి, స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకరే బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం.. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యేను శాసనసభ ప్రొటెం స్పీకర్‌ గా నియమిస్తారు. అయితే ఈసారి రెండో స్థానంలో ఉన్న ఎమ్మెల్యేకు ఆ ఛాన్స్‌ దక్కింది.

కేసీఆర్‌ గాయపడడంతో..
తెలంగాణ శాసనసభ నూతన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యవహరించనున్నారు. అక్బరుద్దీన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అత్యధికంగా 8 సార్లు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి చెందిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఇక, కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ మంత్రులుగా ఎంపికయ్యారు. ఎక్కువసార్లు ఎన్నికైన మాజీ సీఎం కేసీఆర్‌ శుక్రవారం తెల్లవారుజామున బాత్రూంలో జారిపడి గాయపడ్డారు. ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కేసీఆర్‌ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు.ఆరుర్లు అసెంబ్లీకి ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు.

ఎమ్మెల్యేలతో ప్రమాణం..
అక్బరుద్దీన్‌తో శనివారం ఉదయం 6:30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ – 64, బీఆర్‌ఎస్‌ – 39, బీజేపీ – 8, ఎంఐఎం – 7, సీపీఐ – 1 సంఖ్యా బలం ఉంది. 2018లోనూ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, 2014లో జానారెడ్డి ప్రొటెం స్పీకర్లుగా వ్యవహరించారు.