Green signal to join BJP: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది కూటమి. కూటమిని దెబ్బతీయాలని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇరుపక్షాల మధ్య గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎలాగైనా బలం పుంజుకోవాలని భావిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచాలని చూస్తోంది కూటమి. ఈ క్రమంలో ఇప్పుడు బిజెపి బలం పెంచడం ద్వారా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. అందుకు గట్టి ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగమే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బిజెపిలో చేరడం.
తిరిగి వైసీపీలో చేరుతున్న క్రమంలో
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూటమి పార్టీల్లో చేరారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎటువంటి వివాదాలు లేని నాయకులను టిడిపిలో చేర్చుకుంది నాయకత్వం. అయితే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. మరోవైపు జనసేనలో సైతం చేరికలు పెరిగాయి. అయితే ఆ పార్టీలో చేరితే భవిష్యత్తులో అవకాశం దక్కుతుందన్న వారు మాత్రమే చేరుతున్నారు. మిగతావారు అయిష్టంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో వారి మనసు మారుతోంది. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే స్ట్రాంగ్ అయ్యేందుకు వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సరికొత్త ప్రయోగం చేయడం ప్రారంభించింది. అటువంటి నేతలను బిజెపిలోకి పంపించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బిజెపిలో చేరారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలనుకున్న నేతలంతా ఇప్పుడు బిజెపిలోకి వెళ్తారు అన్నమాట.
అప్పట్లో మూడు పార్టీల మధ్య ఒప్పందం..
కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలు కూటమి పార్టీలో చేరారు. అయితే వైసిపి హయాంలో వివాదాస్పద ముద్ర పొందిన నేతలు సైతం చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే వారి రాకతో కూటమిలో ఇబ్బంది కరం ఉంటుందని భావించిన తెలుగుదేశం పార్టీ చేరికలకు బ్రేక్ వేసింది. మరోవైపు 2019 తర్వాత టిడిపి అనుసరించిన ఫార్ములానే వైసీపీ సైతం అనుసరించడానికి సిద్ధమయింది. తద్వారా టిడిపి కూటమిలో విచ్ఛిన్నం, పొత్తు లేకుండా చేయడం వంటివి చేసేందుకు కొంతమంది వైసీపీ నేతలు బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు టిడిపి అనుమానించింది. అందుకే చేరికల విషయంలో మూడు పార్టీల మధ్య అవగాహన ఉండాలని.. అందరి సమ్మతంతోనే పార్టీల్లో చేరిక ఉండాలని ఒక షరతు పెట్టింది టిడిపి. దీంతో కూటమి పార్టీల్లో వైసీపీ నేతల చేరికకు బ్రేక్ పడింది.
ఆ ఎమ్మెల్సీ చేరిక వెనుక..
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత( Sunita ) బిజెపిలో చేరారు. ఏకంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె చేరడం విశేషం. వాస్తవానికి ఆమె తెలుగుదేశం పార్టీ బ్యాగ్రౌండ్ కలిగిన నాయకురాలు. పరిటాల కుటుంబానికి సన్నిహితురాలు. తప్పకుండా ఆమె టిడిపిలో చేరాలి. కానీ మారిన టిడిపి వ్యూహంతోనే ఆమె బిజెపిలో చేరినట్లు సమాచారం. వైసీపీలో ఉండడానికి ఇష్టపడిన నేతలు, గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు కచ్చితంగా బిజెపిలో చేరుతారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చూడడం, బిజెపిని బలం పెంచి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సేవలను వినియోగించుకోవడం చేయాలన్నది టిడిపి ప్లాన్ గా తెలుస్తోంది.