AP Mega DSC 2025: ఏపీ( Andhra Pradesh) డీఎస్సీ కి సంబంధించి కీలక అప్డేట్. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఈరోజు తుది జాబితా విడుదల కానుంది. ఎవరెవరికి ఉద్యోగాలు వస్తాయో స్పష్టం కానుంది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ కు సంబంధించి సంతకం చేశారు సీఎం చంద్రబాబు. అనుకున్నట్టే అన్ని ఇబ్బందులను అధిగమించి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆన్లైన్లో పరీక్షలు పూర్తి చేశారు. అనుకున్న గడువు కంటే రెండు రోజులు ముందే ఫలితాలు విడుదల చేశారు. అదే సమయంలో మెరిట్ లిస్టు ప్రకటించి ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈరోజు తుది జాబితాను ప్రకటించనున్నారు. అయితే వివిధ కారణాలతో 300కు పైగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఈరోజు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 600కు పైగా పోస్టులు మిగిలిపోతాయని భావించారు. కానీ వాటిని తగ్గించేందుకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఏడు విడతల్లో చేపట్టారు.
తుది జాబితా విడుదల..
తుది జాబితా అంటే ఉద్యోగాలకు ఎంపికైనట్టే. ఈ తుది ఎంపిక జాబితాను జిల్లా కలెక్టరేట్( district collectorate ), డిఇఓ కార్యాలయాలు, అధికారిక వెబ్ సైట్ cse.apcfss.in లో అందుబాటులో ఉంచనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. తుది ఎంపిక జాబితాలో ఉన్నవారికి సెప్టెంబర్ 19న అమరావతి లోని సచివాలయం సమీపంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు అందించనున్నారు. ఇందుకుగాను భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందిస్తారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దసరా సెలవులు ముగిసిన తరువాత.. పాఠశాలలు తెరుచుకునే సమయానికి వీరందరూ విధుల్లో హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది.
నెరవేరిన చంద్రబాబు హామీ..
తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ( Mega DSC) ప్రకటిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. అయితే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్, ఇతరత్రా ప్రక్రియను పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 6 నుంచి జూలై రెండు వరకు రెండు విడతలుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. కాగా డీఎస్సీ నియామకానికి సంబంధించి 336,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేశారు. ఆగస్టు 1న తుది కీ ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఏడు విడతల్లో పూర్తి చేయగలిగారు. ఈరోజు తుది జాబితాను ప్రకటించి.. ఈనెల 19న నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు