Bigg Boss Hosting : ప్రపంచవ్యాప్తంగా ఉండే బుల్లితెర ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బ్రదర్. దీనిని మన ఇండియా లో బిగ్ బాస్ పేరిట, సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా మొట్టమొదటిసారి బాలీవుడ్ లో ప్రారంభించారు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఒకటి కాదు, రెండు కాదు, విజయవంతంగా 18 సీజన్స్ అక్కడ పూర్తి చేశారు. బాలీవుడ్ లో సక్సెస్ అయ్యాక, కన్నడ లో కిచ్చా సుదీప్ ని హోస్ట్ గా పెట్టి ప్రారంభించారు. ఆ తర్వాత మలయాళం లో మోహన్ లాల్ తో, తెలుగు లో జూనియర్ ఎన్టీఆర్ తో, తమిళం లో కమల్ హాసన్ లతో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని మొదలు పెట్టారు. అన్ని భాషల్లోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ అయితే ప్రతీ ఏడాది ప్రసారం అవ్వబోయే సరికొత్త సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.
మన తెలుగు లో ఇప్పటి వరకు 8 సీజన్స్ పూర్తి అయ్యాయి. ఆరవ సీజన్ తప్ప, మిగిలిన అన్ని సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండవ సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత సోషల్ మీడియా లో ఆయనపై ఏర్పడిన నెగటివిటీ ని చూసి, ఈ హోస్టింగ్ నా వల్ల కాదంటూ మానేసాడు. ఇక ఆ తర్వాత మూడవ సీజన్ నుండి 8వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే 8వ సీజన్ లో నాగార్జున పై ఏర్పడిన నెగిటివిటీ అంతా ఇంతా కాదు. పరమ చెత్త హోస్టింగ్ అంటూ అభిమానుల చేత కూడా తిట్లు తినే పరిస్థితి ఏర్పడింది. తదుపరి సీజన్ కి కూడా ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తే ఈసారి రేటింగ్స్ పాతాళలోకంలోకి వెళ్లే అవకాశం ఉన్నందున మేకర్స్ ఆయన్ని తప్పించే ప్రయత్నం లో ఉన్నారట.
9వ సీజన్ కి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. మరోపక్క తమిళం లో 7 సీజన్స్ కి విజయవంతంగా హోస్టింగ్ చేసిన కమల్ హాసన్ కూడా 8వ సీజన్ కి హోస్టింగ్ నుండి తప్పుకున్నాడు. అదే విధంగా కన్నడలో కూడా కిచ్చ సుదీప్ విజయవంతంగా 10 సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ఆయన కూడా హోస్టింగ్ నుండి తప్పుకుంటున్నాడు. తమిళం లో ఇప్పుడు కమల్ హాసన్ కి బదులుగా విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మరి కన్నడలో సుదీప్ కి రీ ప్లేస్ గా ఎవరు రాబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. అదే విధంగా తెలుగులో ఈసారి ముందుగానే 9వ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.