https://oktelugu.com/

Vizianagaram MLC Election: నామినేషన్ల స్క్రూట్ని.. ఎన్నికలు రద్దు.. విజయనగరం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్

అధికార యంత్రాంగం ఎన్నికల సన్నాహాలను ప్రారంభించింది. నామినేషన్లను సైతం స్వీకరించింది. ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏకంగా ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసింది.

Written By: Dharma, Updated On : November 15, 2024 12:29 pm
Vizianagaram MLC Election

Vizianagaram MLC Election

Follow us on

Vizianagaram MLC Election: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ సి.ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఉండేవారు.వైసీపీ తరఫున ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే ఈ ఏడాది జూన్ 2న ఆయనపై అనర్హత వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మండలి లో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ మోసేన్ రాజు రఘురాజు పై అనర్హత వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అప్పటినుంచి ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది.దీనిని నోటిఫై చేస్తూ ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధపడింది.ఈనెల నాలుగున షెడ్యూల్ వెల్లడించింది.నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం అయింది.ఇంతలో హైకోర్టులో రఘురాజు పిటిషన్లు వేశారు.తనకు కనీసం నోటీసు అందించకుండా అనర్హత వేటు వేసారని.. రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీస వివరణ తీసుకోకుండా.. నోటీసులు జారీ చేయకుండా.. ఏకపక్షంగా అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఎన్నికలను రద్దు చేసింది. తిరిగి రఘురాజును ఎమ్మెల్సీగా కొనసాగించాలని ఆదేశించింది.

* ఎట్టకేలకు ఈసీ స్పందన
అయితే అప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అని అడిగారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్లు సైతం స్వీకరించారు. చివరకు ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 28న ఓటింగ్ కు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది ఈ సి. దీంతో ఇందుకూరి రఘురాజుకు లైన్ క్లియర్ అయింది. ఆయన 2027 సెప్టెంబర్ వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

* వైసిపి ఆశలపై నీళ్లు
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వైసిపి షాక్ కు గురైంది. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంభంగివెంకట చిన అప్పలనాయుడును అభ్యర్థిగా ఖరారు చేసింది. జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి ఏకపక్ష మెజారిటీ ఉంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుపొందుతారని జగన్ భావించారు. జిల్లా నాయకులకు దేశానిర్దేశం చేశారు. అయితే కూటమి తరపున ఎవరు పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ మహిళా నేత, రఘురాజు భార్య సుబ్బలక్ష్మి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. దీనికి తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఆమె ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. కానీ ఈసీ ఏకంగా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయడంతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయ్యింది.