IPL 2024 SRH Vs MI: ముంబై ఇండియన్స్..ఇదేం అనామక జట్టు కాదు. అందులో ఉన్న ఆటగాళ్లు రంజి స్థాయి వాళ్ళు కాదు. కానీ ఐపీఎల్ 17వ సీజన్లో ఆ జట్టు క్రీడాకారుల ఆట తీరు పేలవంగా ఉంది. ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన రికార్డు ఉన్న ఆ జట్టు.. నేడు వచ్చి రాని ఆటతో అభాసు పాలవుతోంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో గుజరాత్ జట్టు చేతిలో ఓడిపోయింది. రెండవ మ్యాచ్లో హైదరాబాద్ ముందు దాసోహం అన్నది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించి పల విషయాలు నెట్టింట్లో చర్చనీయాంశవుతున్నాయి.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండేవాడు. అనుకోకుండా అతడిని కెప్టెన్ పదవి నుంచి పక్కకు తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు. దీంతో ఆ జట్టులో వివాదం రాజుకుంది. కొంతమంది ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకించారు. ఒకానొక దశలో రోహిత్ శర్మ ఐపిఎల్ కు దూరమవుతాడని వార్తలు వినిపించాయి. అతని భార్య రీతిక అయితే ఏకంగా తన భర్తకు అన్యాయం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది.
ఇవన్నీ వ్యవహారాలు జరుగుతుండగానే ఐపిఎల్ లోకి ముంబై జట్టు ఎంట్రీ ఇచ్చింది. గత రెండు సీజన్లలో ముంబై జట్టు ఆట తీరు గొప్పగా లేకపోయినప్పటికీ.. ఈ సీజన్లో ఆ జట్టు హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ఆ జట్టు మేనేజ్మెంట్ పై అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బుధవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ ఆటగాళ్లు 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగులు చేయడం విశేషం. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమమైనది.
హైదరాబాద్ విధించిన టార్గెట్ ను ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. లక్ష్యాన్ని చేదించేందుకు అది సరిపోలేదు. చివరి వరకు పోరాడినప్పటికీ ముంబై ఇన్నింగ్స్ 246 పరుగుల మధ్య ముగిసింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 26, కిషన్ 34, నమన్ ధీర్ 30, తిలక్ వర్మ 64, డేవిడ్ 42 రన్స్ చేసినప్పటికీ ముంబై గెలవలేకపోయింది.
ఈ ఓటమి అనంతరం ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్సీ విషయంలో తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. ఒత్తిడి వల్ల అతడు జట్టును సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. బౌలింగ్ మార్పులు, సరైన స్థాయిలో ఫీల్డింగ్ సెట్ చేయకపోవడంతో ముంబై జట్టు ఇప్పటికే రెండుసార్లు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడినట్టు తెలుస్తోంది.. మళ్లీ జట్టు బాధ్యతలు స్వీకరించాలని కోరినట్టు సమాచారం.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఆకాష్, రోహిత్ చర్చలు జరిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముంబై జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ రావాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.