
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కూలీల బాధలు వర్ణనాతీతం. సొంత ప్రాంతాలకు వెళ్లేవారు కాలినడకన నడుస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీల దుర్మరణం మారువకముందే తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలలో పద్నాలుగు మంది వలస కార్మికులు మరణించడం బాధాకరం.
ఉత్తర్ ప్రదేశ్, బిహార్ కు చెందిన వలస కూలీలు తమ ప్రదేశాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటనలు జరిగాయి. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ వద్ద వలస కూలీలపై ఒక బస్ దూసుకు వెళ్లగా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. . బిహార్ కు చెందిన వీరంతా పంజాబ్ నుంచి తమ స్వగ్రామానికి కాలినడకన వెళుతుండగా ప్రమాదానికి గురై మరణించారు. మద్యప్రదేశ్ లో జరిగిన మరో ఘటనలో ఎనిమిది మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర నుంచి సుమారు 60 మంది వలసకూలీలు లారీలో తమ స్వస్థలానికి బయలుదేరగా గుణ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. లారీ్,బస్ డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు.
