Telangana IAS officer: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత మీకు తెలుసు కదా.. ఆ సామెత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అనుభవంలోకి వచ్చింది. దీనికి కారణం ఓ ఐఏఎస్ అధికారి.. ప్రభుత్వానికి మేలు చేస్తున్నాననే భావనతో ఆమె చూపించిన తెగువ వల్ల కొత్త తలనొప్పులు తలెత్తుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూస్తోంది. ఒకటి జరుగుతుందని అనుకుంటే.. మరొక దానికి కారణం కావడంతో.. ఆ ఐఏఎస్ అధికారి కూడా తల పట్టుకోవాల్సి వస్తోంది.
వారి రాకతో..
రాష్ట్రానికి సంబంధించి కొన్ని సంస్థలు దాదాపు 1400 కోట్ల దాకా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు వాణిజ్య శాఖకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కమర్షియల్ టాక్స్ కమిషనర్ టికె శ్రీదేవి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఆమె జాయింట్ కమిషనర్ రవితో కలిసి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1400 కోట్ల పన్ను ఎగవేత అని తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కేసును సిఐడి కి అప్పగించింది. రంగాల్లోకి దిగిన సిఐడి మాజీ సిఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర జిఎస్టి అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వర రావు, జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు పై కేసు పెట్టింది. ఈ కేసు పై సిఐడి పలు ఆధారాలు సేకరిస్తుండగా.. ఈలోపు సెంట్రల్ జిఎస్టి బృందం రంగంలోకి దిగింది. ఆ పన్ను ఎగవేసిన వారి పేర్లను తమకు ఇవ్వాలని ఒక లెటర్ రాసింది. అయితే ఇక్కడే అసలు కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు తరలిపట్టుకుంటున్నారు.
ఆధారాలు లేవట
సిఐడి అధికారులు జాయింట్ కమిషనర్ రవిని విచారించగా.. ఆధారాలు లేవని చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తనకు శ్రీదేవి మేడం చెప్తేనే ఫిర్యాదు చేశానని.. తనకు ఇతర వివరాలు తెలియదని రవి చెప్పడంతో సిఐడి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. కేవలం అనుమానంతోనే కేసులు పెట్టడంతో ప్రభుత్వ పెద్దలు సైతం ఆగ్రహంతో ఉన్నారు. అయితే శ్రీదేవి కి అనుమానం కలిగించిన సంస్థల్లో ప్రభుత్వానికి చెందినవి కూడా ఉండడంతో పోలీసులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి శ్రీదేవిని ప్రాధాన్యం లేని పోస్ట్ కు బదిలీ చేసింది.. మరోవైపు సెంట్రల్ జిఎస్టి అధికారులు పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తుండడంతో.. ఏం చేయాలో పాలుపోవడం లేదని రాష్ట్ర అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించేలోపే ప్రభుత్వ వర్గాలు నష్ట నివారణ చర్యలకు దిగాయని తెలుస్తోంది. శ్రీదేవిని ప్రభుత్వ పెద్దలు మందలించినట్టు ప్రచారం జరుగుతోంది. ముందు వెనుక చూసుకోకుండా అలా ఎలా చేస్తారంటూ మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీదేవిని ప్రశ్నించినట్టు సచివాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై శ్రీదేవి కూడా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.