Rahul- Gill: ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న, టెస్టు క్రికెట్ విశ్వవిజేతను నిర్ణయించే కీలక టోర్నీ ప్రారంభమైంది. కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తోన్న బోర్డర్ – గావస్కర్ టెస్టు సిరీస్–2023 ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీం ఇండియా సెలక్షన్ తీరు మళ్లీ చర్చనీయాంశమైంది. సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్‌భరత్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు. అయితే ఈ ఏడాది వరుసగా శతకాలు బాదుతున్న శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.
గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నా..
వన్డే, టీ–20ల్లో శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయినా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకోలేదు. ఫామ్‌లో లేని కేఎల్.రాహుల్‌కు మాత్రం తుది జట్టులో చాన్స్ దక్కింది. ఇదే ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతుంది. రాహుల్ ప్రస్తుతం ఏ ఫార్మాట్ లోనూ ఫామ్‌లో లేడు. అలాంటి ప్లేయర్ కోసం ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ–20లో శతకంతో చెలరేగిన గిల్ ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బ తీసేలా ఉందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Leo Movie Ram Charan: విజయ్ లియో మూవీలో రామ్ చరణ్… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మెగా హీరో?
వివాదాస్పద నిర్ణయాలతో
బీసీసీఐ నుంచి టీం ఇండియా ఫైనల్ సెలక్షన్ వరకు అంతా రాజకీయాలే అన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాలెంట్‌ను పక్కన పెట్టి పైరవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని బీసీసీఐపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసిన క్రీడాకారుల్లో తాజాగా టాలెట్‌ను పక్కకు పెట్టడం చర్చనీయాంశమైంది. రాహుల్‌ను సెలక్ట్ చేయడానికి సీనియర్ అనే ఒక్క కారణం మినహా తుదిజట్టులోకి తీసుకోవడానికి ఏవిధంగానూ అర్హత లేదు. ఈ నిర్ణయంపై టీం ఇండియా మేనేజ్‌మెంట్‌ను సోషల్ మీడియా వేదికగా శుభ్‌మన్ గిల్ అభిమానులు ఓ ఆటాడుకుంటున్నారు.
ఈ సిరీస్‌తో టెస్టు చాంపియన్ ఫైనల్ బెర్తు ఖరారు..
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్‌లో భారత్ 2–0 లేదా 3–1 తేడాతో నెగ్గాల్సి ఉంది. అప్పుడే టీమిండియా జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్తుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు నాగపూర్‌లో ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Also Read: Hyper Aadi: పవన్ కళ్యాణ్ కావాలా? ఢీ కావాలా? అని అడిగారు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్