India vs Pakistan: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరులను చంపిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, జలంధర్, లూధియానా, ఛండీగఢ్, భటిండా, నల్, ఫలోడి, భుజ్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, భారత అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసి, ఈ దాడులను గగనతలంలోనే తిప్పికొట్టింది.
ఆపరేషన్ సిందూర్‌తో వణికిపోయిన పాకిస్థాన్ ఉనికి చాటుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎల్‌వోసీ వెంట కాల్పులకు తెగబడుతోంది. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో మిసైల్లతో దాడి చేసింది. చైనా తయారీ హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బీవీఆర్ క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడులకు యత్నించింది. ఈ క్షిపణులు దీర్ఘ దూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగినవి. అయితే, భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎస్-400 వ్యవస్థలు వీటిని సమర్థవంతంగా నిర్వీర్యం చేశాయి. అమృత్‌సర్ సమీపంలో క్షిపణి శకలాలు లభ్యమైనట్లు అధికారులు ధ్రువీకరించారు. భారత సైన్యం ఈ శకలాలను సేకరించి, పాక్ దాడులకు ఆధారాలుగా సమర్పిస్తోంది.
లాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై భారత్ దాడి
పాకిస్థాన్ దాడులకు ప్రతిగా భారత సైన్యం లాహోర్‌లోని పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడిలో హెచ్‌క్యూ-9 వ్యవస్థ ధ్వంసమైంది, దీనితో పాక్ రక్షణ సామర్థ్యం బలహీనపడింది. ఈ చర్య భారత్ యొక్క సాంకేతిక ఆధిపత్యాన్ని, శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల సామర్థ్యాన్ని చాటింది.
నియంత్రణ రేఖ వెంట కాల్పులు..
నియంత్రణ రేఖ (LoC) వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారీ ఫిరంగి, మోర్టార్ దాడులు చేసింది. రాజౌరీ, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలతో సహా 16 మంది పౌరులు మరణించారు. భారత సైన్యం ఈ దాడులకు గట్టిగా స్పందించి, పాక్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేసింది.
ఈ ఉద్రిక్తతలపై ఐక్యరాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ భారత్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతు ఇస్తుండగా, చైనా పాకిస్థాన్ వైపు నిలిచింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, “ఉగ్రవాదంపై రాజీ లేదు” అని స్పష్టం చేశారు. పాక్ దాడి యత్నాలు విఫలమైనప్పటికీ, ఉత్తర, పశ్చిమ భారతదేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది.