US Air Force: అమెరికా అమ్ములపొదిలో మరో ఆయుధం.. రక్షణకు అదే వెన్నెముక

బీ–21 రైడర్‌ను డిజైన్‌ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని ఇటీవల సెనేట్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్‌ వెల్లడించారు.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 3:28 pm

US Air Force

Follow us on

US Air Force: అగ్రరాజ్యం అమెరికా.. రక్షణ రంగానికి ప్రపంచంలోనే అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం ఇదే. మరోవైపు ప్రంపచంలో అనేక దేశాలను శాసించే స్థాయిలో ఉన్న ఈ దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అయినా అంతర్గత భయం ఆ దేశాన్ని వెంటాడుతోంది. తాజాగా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ఘటనల్లో అణుబాంబు బెదిరింపులు తరచూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఉనికికి ప్రమాదం తలెత్తితే అణ్వస్త్రాల ప్రయోగానికి వెనకాడబోమని అటు రష్యా, ఇటు ఇరాన్‌ హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఈ రెండు యుద్దాల్లో అమెరికా తమ మిత్రపక్షాలవైపు నిలబడింది. ఈ తరుణంలో అగ్రరాజ్యం ఇటీవల ఓ అత్యాధునిక యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.

అణ్వస్త్ర సామర్థ్యం….
తాజాగా విడుదల చేసిన ఫొటోలోని విమానానికి అణ్వస్త్ర సామర్థ్యం ఉంది. 2023 నవంబర్‌లో ఈ బీ21 రైడర్‌( (B-21 Raider) యుద్ధ విమానాన్ని తొలిసారి అమెరికా పరీక్షించింది. తాజాగా దాని ఫొటోలు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్స్‌ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు తీసిన ఫొటోలు ఇవి. రాడార్‌ సహా శత్రుదేశాల అత్యధునిక సాంకేతికతను సైతం చిక్కకుండా ఎగర గలిగే సెల్త్‌ బాంబర్‌ కావడం దీని విశేషం. అమెరికా వాయుసేనకు వెన్నెముకగా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా దీనిని అభివర్ణిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరే అవకాశం ఉంది.

లక్ష్యాలకు అనుగుణంగా పని..
బీ–21 రైడర్‌ను డిజైన్‌ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని ఇటీవల సెనేట్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు పరీక్షించారు, ఎంత సమయం గాల్లో ఎగిరింది. ఇంకా ఎన్నిసార్లు పరీక్షిస్తారనే విషయాలను మాత్రం వెల్లడంచలేదు. ఇది సాధాణ పేలుడు పదార్థాలతోపాటు అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లేలా రూపొందించారు. దక్షిణ డకోటాలోని ఎల్స్‌వర్త్‌ వైమానికి స్థావరంలో వీటిని ఉంచనున్నారు. మిస్సైరీలోని వైట్‌మైన్, టెక్సాస్‌లోని డైస్‌ వైమానిక స్థావరాలు బ్యాకప్‌ కేంద్రాలుగా ఉండనున్నాయి.

100 విమానాల తయారీ..
ఈ బీ–21 రైడర్‌ విమానాలను మొత్తం 100 ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా వాయుసేన అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆరు తయారీ దశలో ఉన్నాయని తెలిపారు. వీటిని అమెరికా సహా మిత్రదేశాల రక్షణలోనూ ఉపయోగిస్తామని పేర్కొన్నారు. వీటి తయారీని నార్త్‌ రాప్‌ అనే సంస్థకు అప్పగించారు. తొలి ఐదు విమానాలను ఎలాంటి లాభాపేక్షలేకుండా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

శత్రువులకు చిక్కకుండా..
బీ–21 రైడర్‌ వెనుక భాగంలో వెడల్పుగా, ముందర సన్నగా ఉండే ఎగ్జాస్ట్‌ ఉన్నట్లు చిత్రాలనుబట్టి రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేడిని తగ్గించడం కోసమే దీనిని ఇలా డిజైన్‌ చేసినట్లు భావిస్తున్నారు. తద్వారా ఇన్‌ఫ్రా రెడ్‌ రేడియేషన్‌ తగ్గి రాడార్‌కు చిక్కకుండా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఎగ్జాస్ట్‌ పెద్దగా నలుపెక్కకపోవడాన్నిబట్టి చూస్తే ఉద్గారాలను లోపలే చల్లబర్చే సాంకేతికత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో అంతరిక్ష వాహక నౌకల్లో వాడే థర్మల్‌ టైల్స్‌ ఉపయోగించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంజిన్‌పై అదనపు ద్వారం ఉడడం చిత్రాల్లో కనిపిస్తుంది. ఇంజిన్‌ ప్రధాన ద్వారాలు ఎక్కువ ఎత్తుకు వెళ్తున్నప్పుడు పూర్తి సామర్థ్యంతో గాలిని లోపలకు పంపలేవు. అప్పుడు అదనపు ఇన్‌టేక్‌లు పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. విమానం పైభాగంలో ఒకటి ముదురు రంగులో ప్రత్యేక తొడుగు కనిపించింది. ఇందులో ఇంజిన్‌ ప్రధాన భాగం ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెక్కలపై ఉన్న ఇండికేటర్లు తిరిగి లోపలికి ముడుచుకునేలా రూపొందించారు. శత్రు దేశాలకు చిక్కకుండా ఈ ఏర్పాట్లు చేసి ఉండవచ్చని అంచనా.