https://oktelugu.com/

My Home Jupalli Rameswara Rao : ఏదో అనుకుంటాం గానీ, రామేశ్వరరావు అంత తోపేమీ కాదు: ధనవంతుల లిస్ట్ బయట పెట్టిన నిజం!

ధనవంతుల జాబితాలో ఆయన పేరు ముందు వరుసలో లేకపోవడం విశేషం. ప్రచారంలో జూపల్లి కంటే దివిస్ మురళి వెనుకబడి ఉన్నప్పటికీ.. సంపాదన విషయంలో మాత్రం అందరికంటే ముందు వరుసలో ఉన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2024 / 11:04 PM IST

    Jupalli Rameshwara Rao

    Follow us on

    My Home Jupalli Rameswara Rao : “డబ్బున్న వాడు మరింత డబ్బు సంపాదిస్తున్నాడు. పేదవాడు మరింత పేదవాడుగా మిగిలిపోతున్నాడు.” చదువుతుంటే శివాజీ సినిమాలో డైలాగ్ గుర్తుకు వస్తోంది కదూ.. నిజంగానే మనదేశంలో పరిస్థితి ఈ డైలాగు మాదిరిగానే ఉంది. సరే ఈ ఆర్థిక అంతరం ఇప్పట్లో మారేది కాదు గాని.. డబ్బున్న వాళ్ళు మరింత డబ్బు ఎలా సంపాదిస్తున్నారో తెలియదు గాని.. అంతకంతకు తమ సంపదను విస్తరించుకుంటున్నారు. వేలకోట్లను దర్జాగా వెనకేసుకుంటున్నారు. తాజాగా ఇలా డబ్బున్న వారి జాబితాను హూరున్ ఇండియా అనే సంస్థ బయట పెట్టింది. గతంలో ఇలాంటి వివరాలను ఫార్చ్యూన్స్, పోర్బ్స్ వంటి సంస్థలు వెల్లడించేవి.

    దేశం విషయానికొస్తే ముకేశ్ అంబానీ – గౌతమ్ ఆదాని మధ్య పోటీ నెలకొంది. కానీ ఈసారి గౌతమ్ ఆదాని నెంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కూడా ఆదాని సంపాదన పెరగడం విశేషం. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎప్పటిలాగానే దివి లేబరేటరీస్ అధినేత మురళి దివి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. 76,100 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎవరికీ అందని ఎత్తులో ఉన్నారు. ఆ తర్వాత స్థానాలలో మేఘా పిచ్చిరెడ్డి 54,800, కృష్ణారెడ్డి 52,700 కోట్లు, హెటిరో పార్థసారధి రెడ్డి 29,900 కోట్లు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ సుబ్రహ్మణ్యం రెడ్డి 22,100, వెంకటేశ్వర్ రెడ్డి 21,900, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత ఎం సత్యనారాయణ 18,500, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు 18,400, రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత సతీష్ రెడ్డి 18,400 కోట్ల సంపదతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    ప్రచారం బాగున్నప్పటికీ..

    తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా సంపద ఉన్న ధనవంతుల్లో నిత్యం మీడియాలో పేరు ప్రచారంలో ఉండేది మాత్రం మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర రావు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే సంపద విషయంలో మాత్రం ఆయన మిగతా వారి కంటే వెనుకబడి ఉన్నారు.. చేతిలో మై హోమ్ రియాల్టీ సంస్థ, మహా సిమెంట్, ఆహా ఓటీటీ, టీవీ9లో వాటాలు, ఇతర కంపెనీలలో పెట్టుబడులు ఉన్నప్పటికీ జూపల్లి రామేశ్వరరావు అనుకున్నంత తోపైతే కాదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఆయన పేరు మార్మోగిపోయేది.. ముచ్చింతల్ లో సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాతల్లో జూపల్లి రామేశ్వరరావు ఒకరు. ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఆ సమయంలో జూపల్లి రామేశ్వరరావు పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోయింది. కానీ ప్రచారం జరిగినంత వేగంగా జూపల్లి రామేశ్వరరావు సంపద పెరగలేదు. గత ప్రభుత్వంలో ఆయన వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగింది.. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జూపల్లి రామేశ్వరరావుకు అడుగడుగున ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. మై హోమ్, మహా.. కంపెనీలు ఉన్నప్పటికీ జూపల్లి రామేశ్వరరావు సంపద విలువ పెరగకపోవడానికి కారణం ప్రభుత్వం మారడమే అని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులకు ఆశించినంత స్థాయిలో అనుమతులు రాకపోవడం.. గ్రూపు సంస్థల్లో ఆదాయం ఆశించినంత స్థాయిలో రాకపోవడంతో ఆయన సంపద పెరగడం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..

    కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేదు

    ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో మై హోమ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తులు పాత ప్రాజెక్టులు కావడం విశేషం. కొత్త ప్రాజెక్టులను మై హోమ్ గ్రూప్ ఇంతవరకు ప్రారంభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం, భూ కేటాయింపులకు సంబంధించి ఆచీ తూచి అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. మై హోమ్ రామేశ్వరరావుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. పైగా హైదరాబాద్ రియల్ మార్కెట్లో స్తబ్దత ఏర్పడటం కూడా రామేశ్వర రావు సంపద తగ్గిపోవడానికి ఒక కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మై హోమ్ వ్యాపారం జోరుగా సాగింది. కొత్త కొత్త ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ కొత్త నగరంలో మై హోమ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్నో బహుళ అంతస్తులను నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అందువల్లే మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు సంపద పెరగలేదు. మీడియాలో జూపల్లి రామేశ్వరరావు గురించి విపరీతమైన ప్రచారం జరుగుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన అనుకున్నంత గొప్పగా సంపద పెరగడం లేదు.. తాజాగా విడుదలైన ధనవంతుల జాబితాలో ఆయన పేరు ముందు వరుసలో లేకపోవడం విశేషం. ప్రచారంలో జూపల్లి కంటే దివిస్ మురళి వెనుకబడి ఉన్నప్పటికీ.. సంపాదన విషయంలో మాత్రం అందరికంటే ముందు వరుసలో ఉన్నారు.