Maruti Suzuki cars : కొత్త ఏడాది వచ్చేసింది. కొంగొత్త ఆశలను మోసుకొచ్చింది. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలని కోరుతూ ప్రపంచమంతా 2024కు స్వాగతం పలికింది. ఇక ఈ ఏడాది కారు ప్రియుల కోసం మారుతి సుజుకీ.. కూడా కొత్త ఏడాది.. కొత్త మోడళ్లతో మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. వాటిలొ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్, ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉన్నాయి. బాలెనో ప్లాట్ ఫామ్‌పై నిర్మించిన ఫ్రాంక్స్ క్రాసోవర్, జిమ్నీ ఎస్‌యూవీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల స్ఫూర్తి సరికొత్త మోడల్స్ లాంచ్ చేయబోతోంది. వేగంగా పెరుగుతున్న కార్ల మార్కెట్‌లో ముందు వరుసలో ఉండాలని భావిస్తోంది.
జోరు కొనసాగేలా..
2024లో మారుతి సుజుకి మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా 2023 జోరును కొనసాగించాలని భావిస్తోంది. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పొ లో మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. అలాగే, ఈ సంవత్సరం చివర్లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ఈ కాన్సెప్ట్ యొక్క మెరుగైన వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈవీఎక్స్ ప్రొడక్షన్ వెర ్షన్ 2024లో విడుదల కానుంది. అదనంగా, మారుతి సుజుకి 2024 లో నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌ను కూడా రిలీజ్‌కు రెడీ చేసింది. ఈ మోడల్ ను కూడా 2023 జపాన్ మొబిలిటీ షో లో ఆవిష్కరించారు.
నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్..
ఈ నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్‌ను ఇప్పటికే జపాన్‌లో లాంచ్ చేశారు. భారతీయుల విశ్వసనీయతను పొందిన కారు మారుతి సుజుకీ స్విఫ్ట్. 2024లో మార్కెట్లోకి రానున్నది స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్. దీనిలో స్వల్ప మెకానికల్ చేంజెస్‌తో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్‌లో ఆకర్షణీయమైన మార్పులు చేశారు. ఈ మోడల్‌లో డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, 360–డిగ్రీల కెమెరా, వివిధ అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ఏడీఎఎస్) వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో జెడ్–సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది ప్రస్తుతం ఉన్న 1.2–లీటర్ కె–సిరీస్ పవర్ ట్రెయిన్‌కు ప్రత్యామ్నాయంగా వస్తోంది.
మారుతి సుజుకీ ఈవీఎక్స్..
సంప్రదాయ వాహనాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకీ కొంత ఆలస్యంగా ప్రవేశిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన రంగం ప్రభావాన్ని కొంత ఆలస్యంగానే మారుతి సుజుకీ గుర్తించిందనవచ్చు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకీ తన ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్‌ను తొలిసారి ఆవిష్కరించింది. ఈవీఎక్స్‌గా నామకరణం చేసిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివర్లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో వివిధ అప్ డేట్స్‌తో మరోసారి ప్రదర్శించారు. మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారుగా ఈవీఎక్స్‌ను 2024లో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించారు. ఇది 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి చార్జి చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తోంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారు 4,300 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,600 మిమీ ఎత్తుతో, ఇది చాలా కాంపాక్ట్ ఎస్ యూవీల ప్రామాణిక పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది. మారుతి సుజుకి ఈవీఎక్స్ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్సూ్యవీ 400 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్. సెడాన్, కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లలో అమ్మకాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఈ మోడల్ స్థిరమైన అమ్మకాలను కొనసాగించగలిగింది. టాక్సీ సెగ్మెంట్లో ఈ మోడల్‌కు ఉన్న స్థిరమైన డిమాండ్ ఇందుకు దోహదపడింది. ఈ మారుతి సుజుకీ డిజైర్‌కు కూడా 2024లో అప్‌డేట్ రానుంది.