https://oktelugu.com/

NTR: ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా జూనియర్ ఎన్టీఆర్

కర్నూలు అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ సైతం తారక్ ఫోటోలను వాడుకోవడం విశేషం. ఈ రాష్ట్రానికి భవిష్యత్ ముఖ్యమంత్రి తారక్ అంటూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.

Written By:
  • Dharma
  • , Updated On : April 26, 2024 3:53 pm
    NTR

    NTR

    Follow us on

    NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా నటన పైనే దృష్టి పెట్టారు. ఎటువంటి రాజకీయ అంశాల జోలికి పోవడం లేదు. ఏ విషయం పైన స్పందించడం లేదు. కానీ ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఏ చిన్న పరిణామం జరిగినా తారక్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, నారా భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు, మొన్న చంద్రబాబు అరెస్ట్.. తదితర పరిణామాలపై ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు టిడిపి సైతం తారక్ విషయంలో చూసి చూడనట్టుగా ఉంది. ఇటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల్లో మరోసారి తారక్ పేరు బలంగా వినిపిస్తోంది.

    అయితే తనకుప్రస్తుతం రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని.. సినిమా రంగంలో బిజీగా ఉన్నానని తారక్ సంకేతాలు ఇచ్చారు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన ఫోటోను, పేరును వాడుకుంటున్నారు. తాజాగా కొడాలి నాని తన ఎన్నికల ప్రచారం, నామినేషన్ ర్యాలీలో తారక్ ఫోటోలను వినియోగించడం విశేషం. కొడాలి నానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. తాజాగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ అనుమతి లేనిదే కొడాలి నాని ఆయన ఫోటోను ప్రదర్శించగలరా? పేరును వాడుకోగలరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజాగా నాని ఈ చర్యలతో ఆయన వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

    మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ సైతం తారక్ ఫోటోలను వాడుకోవడం విశేషం. ఈ రాష్ట్రానికి భవిష్యత్ ముఖ్యమంత్రి తారక్ అంటూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. సీనియర్ నేత టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను వినియోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా కాబోయే సీఎం అంటూ సంబోధించడం వెనుక రకరకాలైన అనుమానాలు కలుగుతున్నాయి. అసలు టీజీ భరత్ ఏర్పాటు చేశారా? లేకుంటే తెలుగుదేశం పార్టీలో గందరగోళం సృష్టించడానికి ప్రత్యర్థులు ఈ ప్రయత్నం చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం.. ఈ ఎన్నికల్లో కనిపిస్తుండడం విశేషం.