Jagan: పంచులకే పంచా.. అదేదో సినిమాలో కమెడియన్ సునీల్ చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. నేరుగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి.. పంచ్ డైలాగులు చెప్పారు సీఎం జగన్. 2019 నుంచి వైసీపీకి రాజకీయంగా సేవలందిస్తోంది ఐప్యాక్. ఈ ఎన్నికల్లో కూడా విశేష సేవలనుంచింది. కానీ దాని ఆర్గనైజర్ మారారు. గతంలో ప్రశాంత్ కిషోర్ ఉండేవారు. ఇప్పుడు రుషిరాజ్ సింగ్ సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఆర్గనైజర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ జగన్ ను కలిసి.. విక్టరీ కొట్టబోతున్నామంటూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత సీఎం జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి వారిని సందర్శించడం.. గతం కంటే ఒక సీటు అధికంగా గెలవబోతున్నామని చెప్పడం కొంచెం అతి అనిపిస్తోంది.
కొద్ది రోజుల కిందటే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. జగన్ ఓడిపోతున్నారని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇచ్చేలా జగన్ మాట్లాడడం విశేషం. అయితే ఇప్పటికే ఐ ప్యాక్ ఒక నివేదిక తయారు చేసింది. అందులో వైసిపికి ప్రమాదం తప్పదని హెచ్చరించింది. ఇప్పుడు వారిని సముదాయించేలా జగన్ మాటలు ఉన్నాయని సెటైర్లు పడుతున్నాయి. ఐ ప్యాక్ టీం ను తన వద్దకు రప్పించుకోవాలి కానీ.. తాను వారి కార్యాలయానికి వెళ్లడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐ ప్యాక్ తో పాటు వైసీపీ శ్రేణులకు ధైర్యం నూరిపోసేందుకే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. గెలుపు పై విశ్వాసం అంతగా కనిపించడం లేదు. కనీసం పోటీ ఇస్తామా? లేదా? ఘోర పరాజయం తప్పదా? అన్న ప్రశ్నలు కూడా వేధిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్లుగా నిలిచిన నేతల నోటి నుంచి బేల మాటలు వినిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అటు పార్టీ నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో ధీమా కనిపించడం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్ ఐప్యాక్ టీం కార్యాలయానికి వెళ్లి ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.