IPL 2025 Playoffs: ఐపీఎల్ లో గ్రూప్ సమరం దాదాపుగా ముగిసినట్టే. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగతా జట్లకు ఒకటి లేదా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. బుధవారం నాటి మ్యాచ్ లో ఢిల్లీ పై గెలిచిన తర్వాత ముంబై ప్లే ఆఫ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ఇప్పటికే తొలి మూడు స్థానాలలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ నిలిచాయి. ప్లే ఆఫ్ విభాగంలో నాలుగో స్థానం కోసం ఢిల్లీ, హార్దిక్ సేన మధ్య తీవ్ర పోటీ జరగగా.. ఉత్కంఠ గా సాగిన పోటీలో ఢిల్లీ జట్టు తలవంచింది. ముంబై జట్టు విజయం సాధించింది. మొత్తంగా ముంబై జట్టు చాలా రోజుల తర్వాత ప్లే ఆఫ్ వెళ్లిపోవడంతో.. ఆ జట్టు ప్లేయర్లు అమితానందంతో ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో ముంబై ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: రాసి పెట్టుకోండి.. వచ్చే సీజన్లో రాజస్థాన్ ఈ ప్లేయర్లను మెడపట్టి బయటికి పంపిస్తుంది!
ఈ సీజన్లో కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. పైగా గత సీజన్లో కోల్ కతా విజేతగా నిలిచింది. ప్రారంభంలో కోల్ కతా మెరుగైన విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత తలవంచడం మొదలుపెట్టింది. హైదరాబాద్ కూడా ప్రారంభంలో తొలి మ్యాచ్ ను భారీవ్యత్యాసంతో సొంతం చేసుకుంది. అయితే తదుపరి ఆ మ్యాజిక్ ప్రదర్శించడంలో విఫలమైంది. ఇక లక్నో కూడా ప్రారంభంలో విజయాలు సాధించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా ఓటములను చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ నిరుడు ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. ఈ సంవత్సరం మాత్రం ఆ స్థాయిలో ఆడలేక పోయింది. జట్టులో విభేదాలు.. ప్లేయర్ల మధ్య అనైక్యత ఆ జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది. ఇక చెన్నై జట్టు కూడా మొదట్లో కాస్త విజయాలు సాధించినప్పటికీ.. ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఏ మాత్రం పోరాటపటిమను ప్రదర్శించకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. మొత్తంగా భారీ అంచనాలున్న జట్లు మొత్తం అత్యంత దారుణంగా విఫలమయ్యాయి. బెంగళూరు మినహా ఈసారి ప్లే ఆఫ్ లోకి మొత్తం కొత్త జట్లు వచ్చాయి. గుజరాత్ గత సీజన్లో గ్రూప్ దశలోనే వెళ్ళిపోయింది. పంజాబ్ కూడా అదే దానిని అనుసరించింది. ముంబై గతంలో ఐదు పర్యాయాలు విజేతగా నిలిచినప్పటికీ.. గత నాలుగు సీజన్లలో ఏమంత గొప్ప ఆట తీరు ప్రదర్శించలేకపోయింది. కానీ ఈసారి మాత్రం బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆట తీరు ప్రదర్శించి.. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వచ్చేసింది. మొత్తంగా చూస్తే గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై అత్యంత బలమైన జట్లు. వీటి మధ్య పోటీ అత్యంత రసవత్తరంగా సాగనుంది. విజయం కోసం ఈ నాలుగు జట్లు చివరి వరకు పోరాడుతాయి. చూసే అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తాయనడం లో ఎటువంటి సందేహం లేదు.