Asia Cup: తిప్పేసిన రేణుక, రాధ.. బెంబేలెత్తిపోయిన బంగ్లా.. ఆసియా కప్ లో ఫైనల్ కు టీమిండియా

ఆసియా కప్ సెమీఫైనల్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం పూర్తి తప్పని భారత బౌలర్లు నిరూపించారు. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 26, 2024 8:23 pm

Asia Cup

Follow us on

Asia Cup: ఆసియా కప్ లో భారత మహిళల జట్టు విజయదుందుభి మోగించింది. బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో బంగ్లాదేశ్ ను ఈజీగా ఓడించేసింది. ముందుగా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కో బంతి ఒక్కో బుల్లెట్.. పడడమే ఆలస్యం అనూహ్యంగా టర్న్ అయింది. టచ్ చేద్దామని అనుకునే లోపలే.. చేయాల్సిన నష్టం చేసేసి వెళ్ళింది.. దీంతో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే వెళ్లిపోయారు. ఫలితంగా భారీ స్కోరు నమోదవుతుందనే భావిస్తే.. వంద మార్కు కూడా చేరుకోలేదు. ఇదీ దంబుల్లా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో భారత వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య పరిస్థితి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల ముందు ఏమాత్రం నిలబడలేకపోయింది. కనీసం ప్రతిఘటించలేక చేతులెత్తేసింది. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది టికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పూజ, దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగర్ సుల్తానా 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. షోర్నా అఖ్తర్ 19 పరుగులు చేసి ఆకట్టుకుంది.. భారత జట్టు 81 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి.. కడపటి వార్తలు అందే సమయానికి 7.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మందాన 36, షఫాలీ వర్మ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

ఆసియా కప్ సెమీఫైనల్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం పూర్తి తప్పని భారత బౌలర్లు నిరూపించారు. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. బంగ్లాదేశ్ జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దిలారా కేవలం 6 పరుగులు మాత్రమే చేసి రేణుకా సింగ్ బౌలింగ్లో అవుట్ అయింది. రేణుక వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయలేక ఉమాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఇస్మా (8) కూడా రేణుక సింగ్ బౌలింగ్లో తనుజ కన్వర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. మరో ఓపెనర్ ముర్సీదా కూడా రేణుక బౌలింగ్ లోనే షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఈ దశలో కెప్టెన్ నిగర్ సుల్తానా జాగ్రత్తగా ఆడింది. 51 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 32 పరుగులు చేసింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో నిగర్ చేసిన 32 పరుగులే టాప్ స్కోర్. రుమానా అహ్మద్ (1), రభేయఖాన్(1) రీతూ మోనీ(5) ఇలా వెంట వెంటనే అవుట్ కావడంతో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. అయితే చివర్లో వచ్చిన షోర్నా అఖ్తర్(19) మెరుపులు మెరిపించడంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

ఇక 81 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలివర్మ, స్మృతి మందాన బంగ్లా బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. అయితే వీరిద్దరిని అవుట్ చేసేందుకు బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మైదానం బ్యాటింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో స్మృతి, షఫాలీ పండగ చేసుకున్నారు. బౌలర్ ఎవరనేది లక్షపెట్టకుండా ఎదురుదాడికి దిగారు. దీంతో ఆ స్వల్ప లక్ష్యం కాస్త కరిగిపోయింది. ముఖ్యంగా స్మృతి బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. వరుసగా ఫోర్లు కొట్టి బంగ్లా జట్టుపై ఒత్తిడి పెంచింది. వాస్తవానికి వందకు మించి పరుగులు చేసి ఉంటే బంగ్లాదేశ్ కాస్తాలో కాస్త పోరాడేది. కనీసం వంద కూడా పరుగులు చేయలేకపోవడంతో పూర్తిగా చేతులెత్తేసింది.. కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన టీమిండియా ఈజీగా గెలిచేసింది. ఈ మ్యాచ్లో గెలిచి ఆసియా కప్ లో భారత్ ఫైనల్ చేరుకుంది.