Suryakumar Yadav: సూర్యను అందుకే కెప్టెన్ చేశాడా? గంభీర్ తో ఆ బంధమే కెప్టెన్సీకి కారణమా?

సూర్య కుమార్ ఆధ్వర్యంలో టీమిండియా శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది. జూలై 27 నుంచి శ్రీలంకతో టీమిండియా టి20 టోర్నీలో అమీతుమీ తెలుసుకోనుంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త సారధి సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారత జట్టు ఇప్పటికే శ్రీలంక వెళ్లిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 26, 2024 4:29 pm

Suryakumar Yadav

Follow us on

Suryakumar Yadav: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 సంవత్సరాల ఎదురుచూపునకు తెరదించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలవడం ద్వారా టీమ్ ఇండియా రెండవసారి ట్రోఫీ అందుకుంది. టీమిండియా ట్రోఫీ దక్కించుకున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని అందరూ ఆసక్తిగా చూశారు. మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. రోహిత్ వారసుడు హార్దిక్ పాండ్యా అని, టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా అతడి స్థానానికి డోకా లేదని చాలామంది అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తప్పయ్యాయి. అందరి విశ్లేషణలను తోసి రాజని బీసీసీఐ టి20 ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను నియమించి సంచలనం సృష్టించింది. అయితే సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించడం వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందనే పుకార్లు వినిపించాయి. అయితే వాటిని నిజం చేసేలాగా సూర్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

సూర్య కుమార్ ఆధ్వర్యంలో టీమిండియా శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది. జూలై 27 నుంచి శ్రీలంకతో టీమిండియా టి20 టోర్నీలో అమీతుమీ తెలుసుకోనుంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త సారధి సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారత జట్టు ఇప్పటికే శ్రీలంక వెళ్లిపోయింది. టి20 సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. భారత జట్టు ఆటగాళ్లు శ్రీలంక మైదానంలో చెమటోడ్చుతున్నారు. సిరీస్ ఎలాగైనా పట్టేయాలని కసితో ప్రాక్టీస్ చేస్తున్నారు. టి20 వరల్డ్ కప్, జింబాబ్వే తో టి20 టోర్నీ గెలుచుకొని భారత జట్టు ఉత్సాహంతో కనిపిస్తోంది.. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మైదానంలో సందడి చేస్తున్నాడు. ఆశావాహ దృక్పథంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ గా ప్రస్తుత పరిస్థితిని తాను ఆస్వాదిస్తున్నానని సూర్య కుమార్ యాదవ్ చెప్తున్నాడు..

సూర్య కుమార్ యాదవ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆ వీడియోలో పంచుకున్నాడు.” 2014లో నేను గంభీర్ నాయకత్వంలో కోల్ కతా జట్టు కోసం ఐపీఎల్ ఆడాను. అప్పటినుంచి మా బంధం మొదలైంది. అది ఇప్పటికీ ప్రత్యేకంగా కొనసాగుతోంది. అది అత్యంత బలంగా ప్రస్తుతం మారింది. నేను ఎలా ఆడతాను.. శిక్షణ సమయంలో నా మెదడు ఎలా పని చేస్తుంది.. నా కదలికలు ఎలా ఉంటాయి.. నా ముందు చూపు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది.. అన్ని విషయాలపై గౌతమ్ గంభీర్ కు ఒక అవగాహన ఉంది. మా ఇద్దరి ద్వయం ఆధ్వర్యంలో ఎటువంటి ఫలితాలు వస్తాయని దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. నాకు కూడా అలాంటి ఆసక్తే ఉంది. ఏదైనా సరే జట్టు విజయం కోసమే నేను ఆడతాను. నా వంద శాతం ఎఫర్ట్ పెడతాను. అందులో ఎటువంటి సందేహం లేదు. నాకు సారధ్య బాధ్యతలు అప్పగించకపోయినా జట్టు విజయం కోసం నేను కృషి చేస్తాను. నేను పలువురు కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడాను. వారందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు కెప్టెన్ గారు రూపాంతరం చెందాను. ఈ బరువైన బాధ్యత. దీనిని నిలబెట్టుకునేందుకు నేను తీవ్రంగా కృషి చేస్తానని” సూర్య కుమార్ యాదవ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఇక టీమిండియా జూలై 27 నుంచి శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతుంది. 27, 28, 30 తేదీలలో ఈ మ్యాచ్లు పల్లెకిలె వేదికగా జరుగుతాయి. టి20 తర్వాత ఆగస్టు 2, 4,7 తేదీలలో టీమిండియా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతుంది. వన్డే సిరీస్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు టి20 కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆ అవకాశం సూర్యకుమార్ యాదవ్ కి దక్కింది. అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ అవడం వెనక కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారం కాదని, నూటికి నూరుపాళ్లు నిజమని సూర్య కుమార్ యాదవ్ తన మాటల ద్వారా నిరూపించాడు. సూర్య కుమార్ యాదవ్ గౌతమ్ గంభీర్ తో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో చెప్పడం ద్వారా నెట్టింట రకరకాల చర్చలు జరుగుతున్నాయి.. హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.