Pawan Kalyan Chandrababu: 2024కు ఏపీ రాజకీయం ఎలా ఉంటుందో అస్సలు ఊహించని విధంగా మారింది. పొత్తుల ఎత్తుల్లో ఎవరు ఎవరితో కలుస్తారో ఊహకందడం లేదు.. పవన్ పై చంద్రబాబ ప్రేమ.. బీజేపీకి శాపంగా మారుతుందా? జనసేన-బీజేపీ మిత్రత్వం చంద్రబాబు వల్ల శత్రుత్వానికి దారితీస్తుందా? వాళ్లిద్దరి పవిత్రబంధంలో చంద్రబాబు పుల్లలు పెడుతాడా? ఇప్పుడు ఇవే భయాలు ఏపీ బీజేపీలో వెంటాడుతున్నాయట.. చంద్రబాబు పొత్తుల ఎత్తుల్లో తమ అడ్రస్ ఎక్కడ గల్లంతవుతుందన్న ఆందోళన బీజేపీ నేతలను వెంటాడుతోందట.. ఇప్పటికే సోము వీర్రాజు ఈ మధ్య పవన్ పై కామెంట్ చేయడం.. ఇప్పుడు చంద్రబాబు అదే పవన్ పై ప్రేమ కురిపించడంతో ఎవరి బంధాలు ఎవరితో కలుస్తాయోనన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు ఆఫర్ ఏపీ బీజేపీని కలవరపెడుతోంది.

రాజకీయాల్లో గండర గండుడు అయిన చంద్రబాబు.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే వరుస ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవి చూశాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొత్తులతోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటి నుంచో బీజేపీతో కలవాలని ప్రయత్నిస్తున్నా.. ఆ పార్టీ మాత్రం ఆయన్ను ఇన్ని రోజులుగా దూరం పెట్టేస్తోంది. దీంతో ఆయన జనసేన వైపు చూస్తున్నారు. పవన్ కూడా పాత మిత్రుడే కాబట్టి తన ప్రపోజల్‌కు కాదనబోరనేది చంద్రబాబు ప్లాన్. కానీ పవన్ తో ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉంది. మరి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెరమీదకు వస్తున్న చర్చ.
కాగా పొత్తులపై చంద్రబాబు కుప్పంలో క్లారిటీ ఇచ్చేశారు. పవన్ మీద తనుకు ప్రేమ ఉంటే సరిపోదని, పవన్ కు కూడా తన మీద ప్రేమ ఉండాలి కదా అన్నట్టు చెప్పేశారు. అంటే పొత్తుకు టీడపీ సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పేశారన్న మాట. అయితే గతంలో కూడా పవన్ తో దోస్తీని వదులుకోవాలని చంద్రబాబు అనుకోలేదు. శ్రీరెడ్డి లాంటి వారితో టీడీపీ నేతలే తన మీద తిట్టిస్తున్నారనే ఆరోపణలతో పవన్ దూరం అయ్యారు.
Also Read: పార్టీలకు అనుకూలంగా పక్కదారి పడుతున్న మీడియా సిద్ధాంతాలు?
ఆ తర్వాత ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తలుచుకుంటే.. శత్రువును కూడా మిత్రుడిని చేసుకోగలరని ఆయన రాజకీయ చరిత్రే చెబుతోంది. కాబట్టి ఏ క్షణంలో పవన్‌ను ఆయన లాగేసుకుంటారో అనే భయం ఏపీ బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు మీద విమర్శలు స్టార్ట్ చేశారు సోము వీర్రాజు. చంద్రబాబు అవసరానికి ఎవరినైనా దగ్గరకు తీసుకుంటారనే సెటైర్లు పేల్చుతున్నారు. కానీ ఈ అంశాలపై అటు పవన్ గానీ, జనసేన నేతలు గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. మరి బీజేపీకి ఎందుకింత టెన్షన్ అంటే.. ఇప్పుడు పవన్ వల్లే అంతో ఇంతో తమ పార్టీకి ప్రాధాన్యత పెరుగుతోంది కాబట్టి.. పవన్ దూరం అయితే తమ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు వారిలో ఉన్న టెన్షన్.
Also Read: పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకుండా చంద్రబాబు గెలవగలడా?