AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. కొరివితో తల గోక్కున్నట్లుగా వ్యవహారం రోజురోజుకు పెద్దదవుతోంది. ప్రతిపక్షం కంటే సొంత పార్టీలోనే విభేదాలు పెరుగుతున్నాయి. దీంతో జనం రోడ్లెక్కి ఆందోళణ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త హాట్ గా అయిపోతోంది. నివురు గప్పిన నిప్పులా విస్తరిస్తోంది. చివరికి పార్టీకే నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్తూరు నుంచి విజయవాడ వరకు అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ నేతలే రోడ్లెక్కుతున్నారు. తమ ప్రాంత సమస్యలపై ఏకరువు పెడుతున్నారు. తమ ప్రాంతాన్ని ఓ జిల్లాలో కలపాలంటే మరో జిల్లాలో కలిపారని ఆందోళన చేస్తున్నారు. దీంతో గొడవలు మరింత ముదురుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త లొల్లి తెచ్చుకున్నట్లు అవుతోంది. ఎందుకురా ఈ తేనెతుట్టెను కదిపామని లోలోపల మథనపడుతున్నారు.
వైసీపీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారుతోంది. నూతన జిల్లాల ఏర్పాటుతో రోజుకో నినాదం తెర మీదకు వస్తోంది. దీంతో వాటిని తీర్చేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడినా సమస్య తీరేలా కనిపించడం లేదు. చాలా చోట్ల డిమాండ్లు పెరుగుతుండటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కొందరిని నియమించి దూకుడు మీద ఉన్న వారిని శాంతింపజేయాలని చెబుతోంది.
Also Read: సవాళ్లు విసిరిన వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్న జగన్.. మిగిలింది అదొక్కటే..!
అయితే జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ వెలువడితే ఇంకా సమస్యలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు తమ పలుకుబడి ఉపయోగించి పార్టీని ఇరుకున పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చి అనవసరంగా సమస్యల్లో ఇరుక్కున్నట్లు భావిస్తున్నారు.
భవిష్యత్ లో పార్టీకి మరింత సవాళ్లే ఎదురు కానున్నాయి. తమ మాట వినలేదనే కారణంతో పార్టీని వీడాలని కూడా కొందరు చూస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: గౌతమ్ సవాంగ్‌కు కీలక పదవి.. జగన్ అసలు వ్యూహం ఇదే..!