Hijras : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అడిగే వాళ్లకు సిగ్గూ ఎగ్గూ ఉండడం లేదు. ఇచ్చే వాళ్లకు మాత్రం నరకం కనిపిస్తోంది.. అడిగేది ఐదో 10 కాదు.. అలా అడిగితే ఇచ్చే వాళ్లకు పెద్ద ఇబ్బంది కాదు. 500 నుంచి మొదలు పెడితే వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నోటికి పనిచెప్పి బండ బూతులు తిడుతున్నారు. ఇదంతా చెబుతున్నది హిజ్రాల గురించి.. వారు చేస్తున్న దాష్టీకాల గురించి.. గతంలో రైళ్లల్లో.. జన సమ్మర్థ ప్రాంతాలలో మాత్రమే వారు కనిపించేవారు. పదో, పాతికో ఇస్తే వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా మీద పడిపోతున్నారు.. ఏదైనా వేడుక జరిగితే చాలు గద్దల్లాగా (ఇక్కడ గద్దలు క్షమించాలి) వాలిపోతున్నారు. అడిగినంత ఇవ్వాల్సిందేనని మంకు పట్టు పడుతున్నారు. ఫంక్షన్ హాల్స్ లో చేరిపోయి.. వేదికపై వాలిపోయి.. బంధువులను రానివ్వకుండా.. వేడుక చేసుకొనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నారు.. ఇలాంటి సంఘటనలు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయాయి. కొంతమంది ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు కూడా ఏం చేయలేకపోతున్నారు.. ఎంతో కొంత ఇచ్చి వారిని బయటికి పంపించండి అంటూ సలహా ఇస్తున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో ఇలాంటి అనుభవం ఒక వ్యక్తికి ఎదురయింది. అతడు తన కూతురి వివాహ రిసెప్షన్ ను ఒక ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహిస్తున్నాడు. బంధువుల రాకతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. పైగా సమయం కూడా రాత్రి అవుతున్నది. ఆ సమయంలోనూ ఆటోలు వేసుకొని హిజ్రాలు వచ్చారు. కాసేపయ్యాక రండి అని వేడుకున్నప్పటికీ వారు వినలేదు. చివరికి అతని వద్ద 5000 దాకా వసూలు చేశారు. హిజ్రాలు పెడుతున్న ఇబ్బందులను కొంతమంది ఫోటోలు తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే.. పోలీసులు ఆ హిజ్రాలను పిలిపించారు. అయితే వారు పోలీసులను కూడా డబ్బులు అడగడం విశేషం. దీంతో పోలీసులు గట్టిగా బెదిరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటేనే హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే గతంలో రైళ్లల్లో హిజ్రాలు తిరిగేవారు. ఇటీవల రైల్వే పోలీసులు కట్టదిట్టం చేయడంతో.. హిజ్రాలు గ్రామాల మీద పడుతున్నారు. వేడుకలు జరిగే ప్రదేశాన్ని తెలుసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు.. అంతేకాదు అక్కడ విందు భోజనాలు తిని.. పార్సిల్లు కూడా కట్టించుకుని వెళ్తున్నారు. అలా ఇవ్వకుంటే వికృత చేష్టలకు పాల్పడమే కాకుండా.. భౌతిక దాడులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.