Harish Rao: తెలుగు స్టేట్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వేతనాలు కూడా ఒకటో తేదీన ఇవ్వలేకపోతున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులకైతే ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కోసం కళ్లు కాయలు చేసుకుని మరీ చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు బదులుగా హరీశ్ రావు (Harish Rao) విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దేశం కంటే తెలంగాణ (Telangana) పరిస్థితి బాగుందని మరీ చెప్పారు. ఇంతలోనే ఏమైంది మన ఆర్థిక పరిస్థితి. ఒకటో తేదీన జీతాలిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పడం గమనార్హం.
దీంతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థమైపోతోంది. చెప్పేవన్నీ నీతులు ఇచ్చేవాన్ని గుడిసెలు అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఈ పరిస్థితికి ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం రెండు మూడు నెలలుగా జీతాలు సక్రమంగా రావడం లేదని సమాచారం. ఉద్యోగ సంఘాలు కూడా నోరు మెదపడం లేదు.కానీ జీతాలు రావట్లేదని ఉద్యోగులే స్వయంగా చెబుతున్నారు.
దళితబంధు పథకానికి రూ. 2 వేల కోట్లు కేటాయించారు. నిధులను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. దళితబంధు పథకానికి నిధులు సమకూర్చినా జీతాలకు మాత్రం డబ్బులు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. కరోనా ప్రభావంతోనే ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయిందని చెబుతున్నా వాస్తవం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. నిధులన్నీ దళితబంధు కోసమే మళ్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
సాధారణంగా ఒకటో తేదీన జీతాలిస్తారని తెలిసినా ప్రభుత్వం మాత్రం అలా చేయడం లేదని తెలుస్తోంది. దీంతోనే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రే ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని చెప్పడంతో మన ఆర్థిక స్థితి ఏమిటో అర్థమైపోతోంది. ఉద్యోగ సంఘాల నేతలు సైతం సైలెంట్ గా అయిపోవడంతో ఇక ఉద్యోగుల గురించి మాట్లాడేవారు ఎవరు అని ఆలోచిస్తున్నారు.