Harish Rao: తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీని ఆగస్టు 15 లోపు నెరవేరుస్తామని సీఎం రేవంత్ ఇటీవల మహబూబ్‌నగర్‌లో ప్రకటించారు. రుణమాఫీ సాధ్యం కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అంటున్నారని తెలిపారు. ఒకవేళ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు తన పార్టీ గుర్తింపు రద్దు చేసుకుంటారా అని సవాల్ చేశారు. సీఎం సవాల్‌పై హరీశ్‌రావు బుధవారం(ఏప్రిల్ 24న) స్పందించారు. రుణమాఫీ అంశంపై రేవంత్ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రమాణానికి పిలుపు..
రుణమాఫీతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిర ఆరు గ్యారంటీలు అమలు ఆగస్టు 15 లోపు అమలు చేస్తామని సీఎం ప్రమాణం చేయాలని హరీశ్‌రావు సవాల్ చేశారు. ప్రమాణానికి తాను కూడా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ముందు అమర వీరుల స్థూపం వద్ద ఇద్దరం శుక్రవారం ప్రమాణం చేద్దాం రావాలన్నారు. ఇద్దరం అక్కడే ప్రమాణం చేద్దామని తెలిపారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలని పేర్కొన్నారు. హామీని నిలబెట్టుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయనని తాను కూడా ప్రమాణం చేస్తానన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
పదవి కంటే ప్రజలే ముఖ్యం..
తనకు పదవికన్నా.. తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. ఆరు గ్యారంటీలను డిసెంబర్ 9న అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఆ మాట తప్పిందని గుర్తు చే శారు. హామీలు నెరవేర్చమంటే.. పార్టీని రద్దు చేసుకుంటారా అని తొండి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 120 గడిచిందని హామీలు ఎందుకు అమలు చేయడం లేదని మరోమారు ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500, రైతులకు పెట్టుబడి సాయం రూ.15 వేలు, పంటకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
వేడెక్కిన తెలంగాణ రాజకీయం..
ఇప్పటికే తెలంగాణలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో వీరి మధ్యలోకి తాజాగా హరీశ్‌రావు వచ్చారు. రేవంత్ విసిరిన సవాల్‌నే స్వీకరించి ఒక్కసారిగా రాజకీయాన్ని మరింత వెడెక్కించారు. మరి హరీశ్‌రావు పిలుపుపై సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారు అన్న ఆసక్తి నెలకొంది.