Balineni Srinivasa Reddy : వైసీపీని వదిలించుకునే పనిలో బాలినేని.. హై కమాండ్ పై అనుచిత కామెంట్స్

వైసిపి ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. నేతల స్వరం మారింది. పార్టీకి భవిష్యత్తు లేదనుకున్నవారు గుడ్ బై చెబుతున్నారు. ఆప్షన్ లేని వారు సైలెంట్ అయ్యారు. అదే సమయంలో కొందరు నేతల విషయంలో హై కమాండ్ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.

Written By: Dharma, Updated On : August 28, 2024 10:44 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy : వైసీపీకి మాజీ మంత్రి బాలినేని నిత్య అసంతృప్తివాదిగా మారిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా బాలినేని అసంతృప్తి స్వరం తగ్గలేదు. తాజాగా చేసిన హాట్ కామెంట్స్ రకరకాల అనుమానాలకు తావిస్తున్నాయి. తనను అసలు హై కమాండ్ పట్టించుకోవడంలేదని, పార్టీ పరంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడం లేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పార్టీ మారిపోతానని తనపై సొంత పార్టీ వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఎలా అడుగులు వేయాలని భావిస్తున్నారు? అన్నది మాత్రం తెలియడం లేదు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని నేరుగా చెప్పడం లేదు. అది సొంత పార్టీ వారు చేస్తున్న ప్రచారంగా చెబుతున్నారు. పైగా పార్టీ మారేందుకు ఇష్టపడిన వారే అలా చేస్తున్నారని సెటైరికల్ గా మాట్లాడుతున్నారు. దీంతో బాలినేని మాటలకు అర్ధాలే వేరులే అన్నట్టు పరిస్థితి మారింది. ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. పోనీ మిగతా పార్టీల నుంచి ఆఫర్ ఏమైనా ఉందా? అంటే మాత్రం ఆ దారి కనిపించడం లేదు. జనసేన లో చేరతారని మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల్లో వైసీపీలోనే కొనసాగారు. ఎన్నికల తరువాత కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ హై కమాండ్ ను కలవడం లేదు. రాష్ట్రస్థాయి సమీక్షలకు వెళ్లడం లేదు. పార్టీలో ఉన్న తనపై మాత్రం కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నారు. నిత్యం అదే అనుమానంతో బతుకుతున్నారు.

* టిడిపిలోకి భారీగా చేరికలు
ఎన్నికల్లో బాలినేని దారుణంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. కొద్దిరోజుల తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టారు. పార్టీ శ్రేణులకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యేకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో సరి అన్నట్టు ఊరుకున్నారు. అయితే చాలామంది వైసీపీ నేతలు టిడిపిలోకి వెళ్లిపోయారు. కానీ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయలేదు బాలినేని. అదే విషయం హై కమాండ్ కు తెలిసినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం ప్రారంభమైంది. పవన్ తో నేరుగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో అంతా ఆయన జనసేనలో చేరతారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనుక సొంత పార్టీ వారే ఉన్నారని బాలినేని అనుమానం వ్యక్తం చేశారు. తాను జనసేనలో చేరడం వారికి ఇష్టం లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు.

* వైవితో విభేదాలు
వైసిపి కీలక నేత వైవి సుబ్బారెడ్డి తో బాలినేనికి విభేదాలు ఉన్నాయి. ఇద్దరూ సమీప బంధువులు. కానీ ప్రకాశం జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసే క్రమంలోఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.తారాస్థాయికి చేరుకున్నాయి.ఒకరంటే ఒకరు గోతులు తీసుకునేదాకా పరిస్థితి వెళ్ళింది. తనకు మంత్రి పదవి పోవడానికి, ఒంగోలులో తన హవా తగ్గడానికి వైవి సుబ్బారెడ్డి కారణమని బాలినేని అనుమానిస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి ఉంటే తాను పనిచేయని కూడా తేల్చి చెప్పారు. అందుకే వైవిని ఉత్తరాంధ్ర రీజినల్ ఇన్చార్జిగా పంపించారు జగన్. ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తానని వైవి భావించినా.. అక్కడ బాలినేని ఉన్నందున జగన్ ఆ సాహసం చేయలేదు. అయినా సరే వైవి తనను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని అనుమానిస్తున్నారు.

* చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయోగం
ఇంకోవైపు తనపై చెవిరెడ్డి భాస్కర రెడ్డిని జగన్ ప్రయోగించారు అన్నది బాలినేనిలో ఒక అనుమానం. ఓటమి తరువాత ప్రకాశం జిల్లా బాధ్యతలను బాలినేని అడిగారు. అందుకు జగన్ అంగీకరించలేదు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తానని చెవిరెడ్డి చెబుతున్నారు. ఇంతలో చెవిరెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా కల్పించారు. అయితే తనను నిర్వీర్యం చేసేందుకే జగన్ ఈ ఎత్తుగడ వేస్తున్నారన్నది బాలినేని లో ఉన్న అనుమానం. మరోవైపు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు బాలినేని. దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. కానీ వైసీపీ హై కమాండ్ నుంచి ఆయనకు ఎటువంటి మద్దతు దక్కలేదు. ఈ పరిస్థితులన్నింటిని చూసిన బాలినేని తెరవెనుక తనపై కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఓటమి తర్వాత పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ హై కమాండ్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.