
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ఆలయాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. నవరాత్రుల లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రుల లో భాగంగా మంగళవారం నాలుగవ రోజు కావడంతో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు కుష్మాండ దేవి రూపమైన శ్రీ అన్నపూర్ణా దేవి అవతారం లో భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
దేవి నవరాత్రుల లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో బంగారు వర్ణం చీరను ధరించి, అష్ట భుజాలతో సింహవాహనంపై కొలువై ఉన్నారు. అష్ట భుజాలతో కలిగి ఉండటం వల్ల ఈ అమ్మవారిని అష్టబుజా దేవి అని కూడా పిలుస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు కాబట్టి, అటువంటి అన్నాన్ని వృధా చేయడం ద్వారా ఈ అమ్మ వారి ఆగ్రహానికి బలి అవుతారు. నవరాత్రులలో నాలుగవ రోజు కనుక అమ్మవారిని పూజించడం ద్వారా ఆయురారోగ్యాలను కల్పిస్తారని, భక్తుల నమ్మకం. అందువల్ల ఈ నవరాత్రులను ఎంతో నియమ నిష్టలతో, కటిక ఉపవాసాలతో అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తుంటారు.
ఆదిభిక్షువైన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు బిక్ష పెట్టిన అమ్మ ఈ అన్నపూర్ణాదేవి. ఈరోజు అమ్మవారికి కేసరి, కొబ్బరితో చేసిన అన్నమును నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆ తల్లి మనకు మేధాశక్తిని, సంపద, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం పొందడానికి అన్నపూర్ణ దేవి స్తోత్రాన్ని చదవడం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై ఉదయం నుంచి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.