Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం.. రాజీనామాకు సిద్ధమైన ఉప ముఖ్యమంత్రి

సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఈసారి దారుణమైన దెబ్బతిన్నది. ఊహించని ఫలితాలు రావడంతో.. బిజెపి రాష్ట్ర నాయకత్వంలో కీలకపాత్ర పోషించిన దేవేంద్ర ఫడ్నవిస్ నైతిక బాధ్యత వహిస్తానని ప్రకటన చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 5, 2024 7:38 pm

Devendra Fadnavis

Follow us on

Devendra Fadnavis: పార్లమెంటు ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవడంతో మహారాష్ట్ర బిజెపిలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఊహించని ఫలితాలు ఎదురు కావడంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏకంగా రాజీనామాకు సిద్ధమయ్యారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశించినంత స్థాయిలో రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వానికి తన నిర్ణయాన్ని తెలియజేశారు.. దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా నిర్ణయం పట్ల ఇంతవరకు బిజెపి కేంద్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.

సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఈసారి దారుణమైన దెబ్బతిన్నది. ఊహించని ఫలితాలు రావడంతో.. బిజెపి రాష్ట్ర నాయకత్వంలో కీలకపాత్ర పోషించిన దేవేంద్ర ఫడ్నవిస్ నైతిక బాధ్యత వహిస్తానని ప్రకటన చేశారు. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కు తన రాజీనామా లేఖను పంపించారు..” సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇబ్బందికి గురిచేశాయి. వీటికి పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నాను. మహారాష్ట్రలో పార్టీకి పూర్తిస్థాయిలో నాయకత్వం నేనే వహించాను. ఏక్ నాథ్ ప్రభుత్వంలో నన్ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని బిజెపి అగ్రనాయకత్వాన్ని కోరుతున్నాను. ప్రస్తుతం నేను అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం కావాలని భావిస్తున్నానని” దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.. దీంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. ఇప్పటికే ఓటమితో డీలా పడిపోయిన క్యాడర్.. దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయంతో మరింత ఆందోళనలో కూరుకు పోయింది.

మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. 2019లో ఈ రాష్ట్రంలో బిజెపి భారీగా స్థానాలు గెలుచుకుంది. అయితే ఇటీవల ఎన్నికల్లో బిజెపి పెంచుకున్న అంచనాలు ఇక్కడ తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలలో కేవలం 9 సీట్లలోనే బిజెపి గెలిచింది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఆధ్వర్యంలోని శివసేన, శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సిపి మహా వికాస్ అఘాడీ గా ఏర్పడి పోటీ చేశాయి. ఏకంగా 29 స్థానాలలో విజయాన్ని సాధించాయి.. సాంగ్లీ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విశాల్ పార్టీ విజయం సాధించడం విశేషం.

భారతీయ జనతా పార్టీ భారీగా స్థానాలు వస్తాయని అంచనా వేసిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. కానీ వాస్తవ రూపంలో మాత్రం వేరే విధంగా ఫలితం వచ్చింది. ఇంత తక్కువ స్థాయిలో సీట్లు రావడాన్ని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా పై.. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం తర్వాతే బిజెపి పెద్దలు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.