Deputy CM Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ని చూసి, అనేక మంది ఈయనకేమి అనుభవం ఉంది?, సుపరిపాలన అందించలేడని అనుకున్నారు. కానీ కూటమి 7 నెలల పాలనలో ఆయనకీ పోటీగా కూటమి నుండి మరో నేత లేరు అనే విధంగా పాలన కొనసాగిస్తూ, తన మార్కు ఏంటో చూపిస్తున్నాడు. ‘గ్రామసభలు’ పేరుతో ఒకేసారి 13 వేల గ్రామాల్లో సభలను నిర్వహించి, ఆ గ్రామాల్లో ఉండే సమస్యలకు పరిష్కరించుకునే ప్రక్రియని మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత ‘పల్లె పండుగ’ పేరు తో 2500 కోట్లతో నిధులను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం గానే కేవలం 6 నెలల్లో 2450 సీసీ రోడ్లు, 20 వేలకు పైగా గోకులాలు, ఇలా గ్రామాల్లో ఎన్నో మౌలిక సదుపాయాలను సమకూర్చి చరిత్ర సృష్టించాడు.
జనవరి 31 వ తేదికి 22,500 గోకులాలు, ఫిబ్రవరి 28 నాటికి 3758 కిలో మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన గిరిజన గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా గిరిజన ప్రాంతాల్లోకి ఎన్నికల తర్వాత వెళ్లి, వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదు. మొట్టమొదటిసారిగా వాళ్ళ కోసం ఆ ప్రాంతాల్లో తిరిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు. ఈ పర్యటనలో అనేకమంది గిరిజనులు తమకు కనీసం మట్టి రోడ్లను అయినా నిర్మించండి అయ్యా అంటూ పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకున్నారు. మట్టి రోడ్లు కాదు, ఏకంగా సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ వాళ్లకు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం నేడు గిరిజన గ్రామాల్లో రోడ్డు నిర్మాణం కోసం 275 కోట్ల రూపాయిలను విడుదల చేస్తూ జీవో ని జారీ చేశాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఈ 275 కోట్ల రూపాయిల నిధులలో కేంద్రం వాటా 163.39 కోట్ల రూపాయిలు కాగా, మన రాష్ట్రం వాటా 111.68 కోట్లు. సరైన పద్దతి లో ఖర్చు చేస్తే కేంద్రం నుండి నిధులు ఏ స్థాయిలో వస్తాయి అనడానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం పాలన. చంద్రబాబు నాయుడు కూడా నిధులను దారి మళ్లించకుండా, దేనికి కేటాయించిన డబ్బులను దానికే ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఆయన పాలన ఎలా ఉండేది అనేది పక్కన పెడితే , ఈ టర్మ్ మాత్రం ప్రస్తుతానికి అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలని విశ్లేషకులు సైతం బలంగా కోరుకుంటున్నారు. ఉగాది నుండి ఆంధ్ర లో సూపర్ 6 పథకాల అమలు కూడా ప్రారంభం కానుంది.