Deadly Thunderstorms: వర్షాకాలం వచ్చిందంటే పిడుగులు పడడం సాధారణం. కానీ, ఇటీవలి కాలంలో పిడుగుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో చినుకు పడితే వణికిపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు వర్షాలు కురిసిన సమయంలో చెట్లు నీడలో ఉంటున్నారు. అదే సమయంలో చెట్లపై పిడుగులు పడుతుండడంతో మృత్యువాత పడుతున్నారు. తాగా ఉత్తరప్రదేశ్‌లో 2 రోజుల వ్యవధిలో 25 మంది పిడుగుపాటుతో మృతిచెందారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్, జౌన్‌పూర్ జిల్లాలు అత్యధికంగా నష్టపోయాయి, ప్రయాగ్‌రాజ్‌లోని సోన్‌వర్స హల్లాబోల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తక్షణ సహాయం..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషాద ఘటనపై స్పందిస్తూ, బాధిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. మరణించినవారి కుటుంబాలకు, నష్టపోయినవారికి వెంటనే పరిహారం అందించాలని సూచించారు. ఈ సంఘటనలో గాయపడినవారికి సరైన వైద్య సహాయం అందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: Rain Alert: ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు.. బిగ్ అలెర్ట్!
పిడుగుపాటు ముప్పు..
ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుతో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2017-2022 మధ్య జూన్, జులై నెలల్లో 58.8% పిడుగుపాటు మరణాలు నమోదయ్యాయని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పులు, వాతావరణ అస్థిరత వల్ల పిడుగుపాటు తీవ్రత పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రైతులు, కార్మికులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారు. పిడుగుపాటు నివారణకు ముందస్తు హెచ్చరికలు, ఆశ్రయ స్థలాలు, ప్రజలలో అవగాహన కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అమలు చేసిన పిడుగుపాటు నివారణ విధానాలను ఉత్తరప్రదేశ్ అనుసరించాలని సిఫారసు చేస్తున్నారు.
Also Read: Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్
ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు ముప్పును, వాతావరణ హెచ్చరికల అమలు లోపాలను బయటపెట్టింది. సరైన ముందస్తు హెచ్చరికలు, ఆశ్రయ సౌకర్యాలు, ప్రజలలో అవగాహన పెంచడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చు. ప్రభుత్వం తక్షణ సహాయం, పరిహారం అందించడం సానుకూలమైనప్పటికీ, దీర్ఘకాలికంగా వాతావరణ విపత్తుల నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం అవసరం.