Covid Alert : కరోనా వైరస్ కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా సైలెంట్‌గా వ్యాప్తి చెందుతోంది. దీనితో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అప్రమత్తమయ్యారు. ఈ కొత్త వేరియంట్ ఆస్ట్రేలియాలోని కొన్ని నగరాల్లో LP.8.1గా గుర్తించారు. నివేదికల ప్రకారం.. ఆస్ట్రేలియాలో దీని కేసులు వేగంగా పెరుగుతున్నాయి. న్యూ సౌత్ వేల్స్‌లో నమోదవుతున్న ప్రతి ఐదు కోవిడ్-19 కేసుల్లో ఒకదానికి ఈ కొత్త వేరియంట్ కారణమని చెబుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లోని కొన్ని నగరాల్లో కూడా దీని కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది.. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
పాకిస్తాన్ అధ్యక్షుడికి కరోనా
కోవిడ్ కొత్త వేరియంట్ పొరుగు దేశం పాకిస్తాన్‌కు కూడా చేరుకుంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కరోనా బారిన పడ్డారు. ‘ది డాన్’ నివేదిక ప్రకారం.. కోవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటి నుండి జర్దారీ ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్న ఆయనను కరాచీలోని ఒక ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఈ ఇన్ఫెక్షన్ గురించి తెలిసిందని వైద్యులు తెలిపారు. జర్దారీ గతంలో కూడా జూలై 2022లో కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన ఏ వేరియంట్‌కు గురయ్యారో తెలియరాలేదు.
కరోనా కొత్త వేరియంట్ LP.8.1 ఎంత ప్రమాదకరం?
LP.8.1 మొదటిసారిగా జూలై 2024లో గుర్తించబడింది. అప్పుడు శాస్త్రవేత్తలు ఇది ఒమిక్రాన్ KP.1.1.3 సబ్-వేరియంట్ అని చెప్పారు. దీని కేసులు గతంలో కూడా కనిపించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జనవరి 2025లో LP.8.1ను ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా వర్గీకరించారు. ఒమిక్రాన్, దాని సబ్-వేరియంట్‌లు శరీరం రోగనిరోధక శక్తిని సులభంగా తప్పించుకుని ప్రజలకు సోకుతాయి.
నిపుణుల ప్రకారం, LP.8.1 స్పైక్ ప్రోటీన్‌లో 6 ఉత్పరివర్తనాలు ఉన్నాయి. దీని ఆధారంగా శాస్త్రవేత్తలు ఇది మన కణాలతో మరింత సులభంగా బంధించగలదని భావిస్తున్నారు. ఇందులో V445R అనే ఒక ఉత్పరివర్తన కనుగొనబడింది. ఇది ఇతర వేరియంట్‌ల కంటే సులభంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని దీనికి ఇస్తుంది. V445R ఊపిరితిత్తుల కణాలను నష్టపరచగలదు. ప్రారంభ నివేదికల ప్రకారం LP.8.1 లక్షణాలు ఇతర సబ్-వేరియంట్‌ల కంటే ఎక్కువ తీవ్రంగా లేవు. కాబట్టి ప్రస్తుతం దీనిని ఎక్కువ ప్రమాదకరమైనదిగా పరిగణించడం లేదు. అయితే, అప్రమత్తంగా ఉండడం.. జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.