పోయినసారి హిందూ మతం రెండు సార్లు తన వునికి కోల్పోయే ప్రమాదం నుండి బయటపడిందని చర్చించుకున్నాం. అలాగే మూడోసారి అటువంటి ప్రమాదం అంచులకు చేరినా తన ఉనికి కోల్పోయే అంత స్థాయిలో లేదుకానీ ప్రమాదపు ఘంటికలయితే మోగినాయని చర్చించుకున్నాం. దానికి ప్రధాన కారణం హిందూ మతం లో ఏర్పడిన నిచ్చెన లాంటి కుల వ్యవస్థ అనేది కూడా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఇదే ఆరోజు నుంచి ఈ రోజు వరకు హిందూ మతానికి అంతర్గత శత్రువు లాగా తయారయ్యింది. దీనిపై దృష్టి సారించకుండా, దీనిపై సంస్కరణల పధంలో ముందుకెళ్ళకుండా వుంటే ఎప్పటికైనా హిందూ మతానికి ముప్పు పొంచే ఉంటుందని మరిచిపోవద్దు. హిందూ మతాన్ని గురించి జబ్బలు చరుచుకునే వాళ్ళలో దీనిపై దృష్టి పెట్టే వాళ్ళు బహుకొద్దిమంది. ఈ విషయం కొచ్చేసరికి వాళ్ళ కులాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. కులం హిందూ మత రక్షణకు అవరోధమని గుర్తించటానికి వీళ్ళకు మనసొప్పదు. అటు హిందూ మతం కావాలి , ఇటు కులమూ కావాలి అనుకునే వాళ్ళ వలనే ఎప్పటికైనా హిందూ మతానికి ప్రమాదం పొంచి వుందని గుర్తించకపోతే నష్టపోయేది హిందూ మతమే. అసలు ఈ కులం ఎలా వచ్చిందో ఒక్కసారి పరిశీలిద్దాం.
కులవ్యవస్థ అనాదినుంచి ఉందా?
దీనికి ఎటువంటి సందేహం లేకుండా లేదు అనే జవాబు వస్తుంది. అటువంటప్పుడు అనాదిగా లేని ఈ కులం ఈరోజు శాశ్వతం ఎలా అవుతుంది? వేదకాలం లో ఆ తర్వాత అసలు కుల ప్రస్తావనే లేదు. హిందూ మత పరిరక్షకులైన ఋషులు, సాధువులు, సంతులు , మునులు వీటికి అతీతంగానే వుండేవారు. ఇతిహాసాల్లో , పురాణాల్లో ఎంతోమంది ఋషులు బ్రాహ్మణులు కాని వారు వున్నట్లు ఆ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. అప్పటికి వున్న వర్ణ వ్యవస్థ కూడా పుట్టుకను బట్టి కాక అతని గుణగణాలు, ఆధ్యాత్మిక శక్తి బట్టి పరిగణించ బడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఋషులు, ఋషుల సతీమణులు కూడా బ్రాహ్మణేతర వర్ణాల నుండి ఎంతోమంది వచ్చారు. అంతెందుకు మహా పవిత్ర కావ్యం రామాయణం రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు. అయితే ఈ పరిస్థితి నుంచి తర్వాత దశలో పుట్టుక తోటే అర్హతలు పొందటం దగ్గరనుంచే వ్యవస్థలో అవలక్షణాలు మొదలయ్యాయి. అయినా అప్పటికీ కుల వ్యవస్థ ఆవిర్భవించలేదు. వర్ణ వ్యవస్థ కే పరిమితమయ్యింది. బుద్ధుడు ఈ పుట్టుకతో వచ్చిన వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. మానవులందరూ ఒకటేనని తన తాత్విక చర్చల ద్వారా నిరూపించాడు. ప్రతిభకే పట్టం తిరిగి ఆవిష్కరించ గలిగాడు.
బౌద్ధం క్షీణించి తిరిగి హిందూ పునరుజ్జీవం జరిగిన తర్వాత మరలా పాత ఆచారాలు , వ్యవహారాలూ మొదలయ్యాయి. అప్పుడూ హిందూ తత్వవేత్తలు , సాధువులు ఎక్కువమంది వర్ణ వ్యవస్థపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎవరో కొంతమంది తప్పించి. కాని హిందూ సమాజం మాత్రం వర్ణ వ్యవస్థ మీదే ఆధారపడింది. క్రమ క్రమేణా అదే కుల వ్యవస్థకు దారితీసింది. వృత్తిని బట్టి కులం ఏర్పడింది. అయినా వెయ్యి సంవత్సరాల క్రితం వరకూ కూడా కులం వున్నా అంతగా స్థిరీకరణ జరగలేదు. కులాంతర వివాహాలు , సహపంక్తి భోజనాలు జరిగేవి. కాకతీయుల కాలం లో కూడా కులం వివాహాలకు పెద్ద ప్రతిబంధకంగా లేదు. రాను రాను హిందూ మత ఉనికి ఇస్లాం దాడితో ప్రమాదం లో పడిన దగ్గరనుంచి కులం పూర్తిగా కరుడుకట్టుకు పోయింది. ప్రతిదీ అదే కులం కట్టుబాటుల్లోనే కుచించుకు పోయింది. దీనికి ఆత్మరక్షణ కోసం ఏర్పడిన పరిణామంగా సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోదన జరగాల్సి వుంది. అయితే ఇది రాను రాను హిందూ సమాజాన్ని చీలికలు, పేలికలుగా తయారు చేసింది. సామాజిక అసమానతలు, బేధ భావాలు పెరిగి అసలు హిందూ మత ఉనికికే ప్రమాదం తెచ్చే స్థాయికి ఎదిగింది.
సామాజిక పరివర్తన దిశగా అడుగులు
ఓ విధంగా బ్రిటిష్ వారి రాక, వారి పరిపాలన తో పాటు సామాజిక విషయాలపై అవగాహన మొదలయ్యింది. క్రైస్తవ మిషనరీలు హిందూ మతం లోని కుల అంతరాలను ఎత్తి చూపటం, ఆధునిక విద్యను ప్రవేశపెట్టటం లాంటి చర్యలు కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. కుల అంతరాలకు వ్యతిరేకంగా సాంఘికోద్యమాలు మొదలయ్యాయి. జ్యోతిరావు ఫూలే లాంటి వాళ్ళు దీనిపై పెద్ద ఉద్యమాన్నే తీసుకొచ్చారు. మద్రాస్ ప్రావిన్సు లోనూ అటువంటి ఉద్యమాలు మొదలయ్యాయి. మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించటం మొదలుపెట్టాక దీనిపై మరింత అవగాహన పెరిగింది. కులం హిందూ మత ఐక్యతకు పెద్ద అవరోధమని గుర్తించాడు. ముఖ్యంగా అస్పృశ్యత పేరుతో కొనసాగుతున్న దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. దానిపై సాంఘిక ఉద్యమాన్ని చేపట్టాడు. రెండోవైపు అంబేద్కర్ విదేశీ చదువులు చదివి భారత్ కి వచ్చి బొంబాయి లో స్థిర పడ్డాడు. తను ఈ వివక్షపై అలుపెరగని పోరాటం చేశాడు. ప్రత్యక్షంగా ఈ పోరాటాలను దగ్గరుండి నడిపించాడు. మహద్ గ్రామ పోరాటం పెద్ద మలుపు. ఇవి ఎంతోమంది హిందూ మత శ్రేయోభిలాషుల మీద కూడా ప్రభావితం చేసింది. గాంధీజీ , అంబేద్కర్ ఎవరి పంధాలో వారు వుద్యమాన్ని నడిపినా ఇద్దరూ ఈ సాంఘిక దురాచారం పోవాలనే కోరుకున్నారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలనే దానిపై ఇద్దరిలో విభేదాలు తీవ్రమయ్యాయి. గాంధీజీ కుల వ్యవస్థ పోవాలని కోరుకున్నా, ఆ మిషతో హిందూ సమాజం విడిపోకూడదని కోరుకున్నాడు. అందుకే ప్రత్యేక నియోజక వర్గాల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చివరకు పూనా ఒడంబడిక తో ఈ వివాదం సమసి పోయింది. ఈ ఒప్పందం తో హిందూ సమాజాన్ని విభజన నుంచి గాంధీజీ కాపాడాడని చెప్పొచ్చు. ఈ ఘటన హిందూ సమాజ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం గా చెప్పొచ్చు.
హిందుత్వానికి ఆద్యుడైన వీర సావర్కర్ కూడా కుల వ్యవస్థని వ్యతిరేకించాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ ఎస్ ఎస్ కూడా తమ పత్రికల్లో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయటం చూసాను. అంటే హిందూ మతస్తుల కోసం పనిచేసే వారు కూడా కులం హిందూ మత ఐక్యతకు ముప్పని గ్రహించారు. కానీ ఆచరణలో కులాన్ని నిర్మూలించ టానికి ఎటువంటి నిర్దిష్ట ఉద్యమం చేపట్టలేదు. ఇది ఈ సంస్థలకు నాయకత్వం వహించే వారిలోని బలహీనతగా చెప్పొచ్చు. ఒకవైపు సమాజం లో వస్తున్న మార్పుల్ని గమనించినా , సూత్రబద్ధంగా కుల వ్యవస్థ తప్పని గ్రహించినా దాని నిర్మూలకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కులాంతర వివాహానికి సర్ సంఘ్ చాలక్ హాజరైనట్లు మాత్రమే వ్యాసాల్లో చూసాను. అది ఒక్కటే సరిపోదు. వాస్తవానికి హిందూ సంస్థలు తీవ్రంగా ఈ సమస్యను తీసుకొని వుంటే ఈ 72 సంవత్సరాల్లో హిందూ సమాజం మరింత ఇక్యతను సాధించేది. ఈ సంస్థలు అగ్రకుల ఆధిపత్యం లో వున్నవనే ఆరోపణల నుండి బయట పడేవి. ముఖ్యంగా హిందూ సమాజానికి ఎంతో మేలు జరిగేది. అంబేద్కర్ హిందూ మతాన్ని విడిచిపోయిన తర్వాతయినా ఈ సమస్య తీవ్రతని గుర్తించ లేకపోవటం ఈ సంస్థల బలహీనత . అయితే బిజెపి రాజకీయపరంగా దీన్ని గుర్తించిందని చెప్పొచ్చు. అధికారం లో ఆ పార్టీ తరఫున వెనకబడిన కులాల వాళ్ళని, దళితుల్ని, ఆదివాసుల్ని, స్త్రీలను కీలక పదవుల్లోకి తీసుకోవటంతో కొంతమేరకు ఈ సమస్యను రాజకీయంగా అధిగమించిందని చెప్పాల్సి వుంటుంది. కానీ సామాజిక సంస్కరణలు రాకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యిందనుకుంటే పొరపాటు. ఈ గుర్తింపు రాజకీయాలు తాత్కాలిక ప్రయోజనాన్నే ఇస్తాయి. దీనికి శాశ్వత పరిష్కారం హిందూ సమాజం లో కులం అంతర్ధానం కావటం ఒక్కటే. అదెలానో చూద్దాం.
రిజర్వేషన్లు పరిష్కారమా?
అంబేద్కర్ , గాంధీజీ పూనా ఒప్పందం తో హిందూ సమాజం లో భాగంగానే దళితులకు రిజర్వేషన్లు అమలులో కొచ్చాయి. రాజ్యాంగం లో దీనిపై స్పష్టమైన హామీలు ఉండటంతో సామాజిక అన్యాయాన్ని నిర్మూలించటం లో ఈ రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తర్వాత దశలో వెనకబడిన కులాలకు కూడా మండల్ కమీషన్ నివేదికతో మరింత స్పష్టంగా రిజర్వేషన్లు అమలుచేయబడ్డాయి. అయితే దీనిపై అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఈ రిజర్వేషన్లు కోరుకున్న అంబేద్కర్ ఆశయం ఎప్పటికైనా కులాన్ని పూర్తిగా నిర్మూలించటమే. కానీ ఈ 72 సంవత్సరాల సామాజిక చరిత్ర చూస్తే కుల గుర్తింపు రాను రాను ఎక్కువవుతుంది తప్పిస్తే తగ్గటం లేదు. సరే ఆ మహాశయుని విశాల దృక్పధాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు తీసుకురావటానికి గల ప్రధాన కారణాన్ని పరిశీలిద్దాం. సామాజిక అసమానతలను, అన్యాయాన్ని తొలగించి సమన్యాయం చేయటం ఆయన ఉద్దేశం. అందుకే వీటిని పదేళ్ళకొకసారి సమీక్షించుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆశించిన ఫలితం ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చిందా అంటే పాక్షిక ఫలితమేనని చెప్పొచ్చు. ఈ 72 సంవత్సరాల్లో రిజర్వేషన్లు వుండటం వలనే ఎంతోమందికి ఉద్యోగాలు, రాజకీయాధికారం వచ్చిందనేది సత్యం. ఆ సదుపాయమే లేకుంటే ఈ అవకాశాలు వీరిలో ఎక్కువమందికి వచ్చివుండేవి కాదనేది కూడా సత్యం. వీటితో పాటు ఇంకో సత్యం కూడా వుంది. ఈ రిజర్వేషను సదుపాయం కల్పించి ఇప్పటికి రెండు తరాలు దాటి మూడో తరం నడుస్తుంది. అంటే మొదటి తరం లో రిజర్వేషన్లతో వుద్యోగం వచ్చిన వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఈ రిజర్వేషను సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందులో వున్నత ఉద్యోగాలు చేసిన వారి ( క్లాస్ 1 ,2 ) తర్వాత రెండు తరాల వాళ్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావటంతో పోటీలో దళితుల్లో సమాజం లో తక్కువ స్థాయి లో వున్న ( గ్రామీణ, పట్టణ పేద , క్లాస్ 3 , 4 ఉద్యోగుల వారసులు) వారు ఈ పోటీలో తట్టుకునే పరిస్థితి లేదు. ఇది కూడా సత్యమే. అలాగే వెనకబడిన వర్గాల్లో సామాజికంగా , ఆర్ధికంగా ఉన్నతంగా వున్న వాళ్ళే ఈ సదుపాయాన్ని దక్కించుకుంటున్నారు. అదే వారిలోని పేద ప్రజలు ఎప్పటిలాగే అన్యాయానికి గురవుతున్నారు. కొంతమేరకు ఆదివాసుల్లోనే పేదవారికి కూడా అవకాశం దక్కుతుంది. ఏ ఆశయం కోసం రిజర్వేషన్లు కల్పించారో ఆ ఆశయం పూర్తిగా నెరవేరటం లేదు. సమాజం లోని అట్టడుగు వారికి ఈ ఫలాలు అందినప్పుడే ఈ రిజర్వేషన్ల ఆశయం సార్ధకమవుతుంది. అదే సమయం లో కులరహిత సమాజ నిర్మాణం దిశగా ఇప్పటికైనా అడుగులు వేయాల్సివుంది.
రిజర్వేషను వ్యవస్థలో మార్పులు రావాలి
సమాజం లో అత్యున్నత స్థానం లో వుండి , మొదటి, రెండో తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో వుండి వారి రెండో తరం వారసులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని సమీక్షించటం అవసరం. ఆ స్థానంలో ఇప్పటివరకు అదే కులంలో వుండి ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం పొందని వాళ్ళు , మూడో, నాలుగో తరగతి ఉద్యోగస్తుల వారసులు , గ్రామీణ, పట్టణ పేద ప్రజలకి అవకాశం కల్పించాలి. ఏ రిజర్వేషన్ క్యాటగిరీలో వుంటే వారికే ఈ సదుపాయం వర్తిస్తుంది. అంటే రిజర్వేషన్ క్యాటగిరీ మారదు. అందులో కొంతమంది అనర్హులవుతారు. ఈ సంస్కరణ అదే కులం లో వున్న అట్టడుగు వారికి లబ్ది చేకూరుతుంది.
అలాగే అంబేద్కర్ ఆశయమైన కులరహిత సమాజం ఏర్పడాలంటే కులాంతర వివాహాల్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగా కులాంతర వివాహం చేసుకున్నవారికి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలి. అందులోనూ ఏ రిజర్వేషన్ క్యాటగిరీలో వాళ్ళను చేసుకుంటే ఆ క్యాటగిరీ రిజర్వేషన్ వర్తించాలి. అలా జరిగినప్పుడే సమాజం లో మార్పు వచ్చే అవకాశముంది. అదే రిజర్వేషన్ లేని ‘వున్నత ‘ కులాల్లో కులాంతర వివాహాలు జరిగినా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కాకపోయినా మిగతా ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇలా జరిగినప్పుడే దీర్ఘకాలం లో కులరహిత సమాజం ఏర్పడుతుంది.
కులరహిత సమాజమే హిందూ సమాజానికి శ్రీరామ రక్ష
హిందూ సమాజం ఇప్పటివరకు నిలబడిందంటే కారణం దాని తాత్విక బలం, వైవిధ్య సంస్కృతి, అన్ని ఆలోచనల్ని తనలో ఇముడ్చుకునే శక్తి . ఇప్పటివరకు తన ఉనికికి వచ్చిన ప్రమాదాల్ని ఎదుర్కుంటూనే వచ్చింది. అయితే ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా వుండవు. అంతర్గతంగా వున్న బలహీనతలను తొలగించుకున్నప్పుడే అది మరింత శక్తిమంతంగా , ఐక్యంగా ముందుకెళ్ళగలదు. దానికి ప్రధాన ముప్పు ఎప్పటికైనా కులమే. ఇది మొదట్నుంచీ ఉన్నదీ కాదు, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలి. 21 వ శతాబ్దం లో పాత కుల వృత్తులు అంతర్దానమయ్యాయి. దానికి అనుగుణంగా మారాలి. అలా మారటమే శ్రీ రామ రక్ష అవుతుంది. లేకపోతే ప్రమాదం ఎప్పుడూ పొంచివుంటుంది. ఇక స్వాతంత్రానంతర హిందూ సమాజం ఎలా మార్పులు చెందిందో వచ్చే భాగం లో చూద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Communal harmony casteless hindu society part7
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com