Warning to TDP MLA’s: సాధారణంగా ఇంటర్వ్యూలు( interviews ), పరీక్షలు తొలి విడతగా పేస్ చేసిన వారిని.. తరువాత విడతలో ఉన్నవారు ఆరా తీస్తుంటారు. ఏం అడిగారని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇకనుంచి రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతానని అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. వారి పరిస్థితిని తెలుసుకొని లోటుపాట్లపై వారితోనే చర్చిస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే ఓ నలుగురు ఎమ్మెల్యేలతో చర్చించారు. వారి పనితీరును ఆధారంగా చేసుకుని కొన్ని రకాల సూచనలు చేశారు. అయితే దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అసలు అధినేత ఏం అడిగారంటూ మిగతా ఎమ్మెల్యేలు వారిని ఆరా తీయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు వారితో ఫోన్లో మాట్లాడుతూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు ఆగ్రహం..
టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు( CM Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పరిశీలకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 56 మంది గైర్హాజరు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విస్తృత సమావేశాలకి రానివారు.. తమ నియోజకవర్గాలకు ఏం చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునే వారు ఇక అక్కడే ఉండడం మంచిది అంటూ చురకలు అంటించారు. అంతటితో ఆగకుండా ఉదయం ఎవరు సమావేశానికి హాజరయ్యారు? ఎంతమంది బయటకు వెళ్లిపోయారు? అనే వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.
ఎమ్మెల్యేల తీరుపై అసహనం..
అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఉదాసీనంగా ఉంటున్నారంటూ వ్యాఖ్యానించారు. చాలామంది ఎమ్మెల్యేలు సీరియస్ గా పని చేయడం లేదని చెప్పుకొచ్చారు. పనితీరు మార్చుకుంటే పర్వాలేదు.. లేకుంటే మార్చేస్తానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో ఎటువంటి మొహమాటలకు పోనని కూడా తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి మాట్లాడుతున్నానని.. రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడి లోటుపాట్లపై చర్చిస్తానని చెప్పారు చంద్రబాబు. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అయిందని చెప్పారు. దీంతో అధినేత మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎవరు అంటూ మిగతావారు ఆరా తీయడం ప్రారంభించారు. వారితో మాట్లాడితే ఏం జరిగింది అనేది తెలుస్తుందని ఉబలాటపడుతున్నారు.
ఆ ఎమ్మెల్యేలకు ఫోన్లు..
అయితే శనివారం మాట్లాడిన నలుగురి ఎమ్మెల్యేల వివరాలు తెలుసుకున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి( Buddha Rajshekar Reddy ), మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషతో సీఎం మాట్లాడినట్లు తెలుసుకున్నారు. అప్పటినుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ల తాకిడి పెరిగింది. అసలు అధినేత ఏం చెప్పారు అని ఎక్కువమంది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో తర్వాత విడతలో ఏ ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు ఎంత టెన్షన్ పడుతున్నారో.. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలది అదే పరిస్థితి.