Chandrababu : దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు. ఏపీలో కూడా చరిత్ర కలిగిన నేతల్లో చంద్రబాబు ముందు వరుసలోనే ఉంటారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆయనది. ఆయన రాజకీయ జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో రకాల సంక్షోభాలను, ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడ్డారు. సంక్షోభాలను సవాళ్లుగా మార్చుకుని అనుకున్నది సాధించగలిగారు. అయితే తన జీవితంలో ఎదురైన ఓటముల గురించి స్వయంగా వెల్లడించారు బాబు. ఢిల్లీలో జాతీయ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు బాబు. గతంలో తనకు తగిలిన ఎదురు దెబ్బలపై ఎన్నో విషయాలను బయటపెట్టారు. 1995లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక సంస్కరణలు, ఇంటర్నెట్ వాడకం వంటి వాటితో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. అవి విజయవంతం కావడంతోనే 1999లో తాను తిరిగి గెలిచిన విషయాన్ని చెప్పారు. అయితే పొగడ్తలకు పడిపోయి ప్రజలను నిర్లక్ష్యం చేయడం వల్లే 2004, 2019లో ఓడిపోయినట్లు ఒప్పుకున్నారు. దీంతో చంద్రబాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
* చుట్టూ భజన పరులు
వాస్తవానికి చంద్రబాబు చుట్టూ భజనపరులు ఉండేవారన్న టాక్ నడిచేది. అదే విషయాన్ని ఒప్పుకున్నారు చంద్రబాబు. అందరూ తనను పొగుడుతుంటే అంతా బాగానే చేస్తున్నట్లు భావించినట్లు చంద్రబాబు అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. దీంతో ప్రజలను వదిలేసి ముందుకెళ్లినట్టు చంద్రబాబు తెలిపారు. ఇదే తనను రెండు ఎన్నికల్లో ముంచేసిందని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో ప్రధాని మోడీ తనలా కాకుండా.. ప్రజలతో కలిసి ముందుకెళ్లడం వల్లే సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు. ఆ అనుభవాలతోనే తాను అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల కోసం మోడీ ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టారని.. ఆయనతో కలిసి ముందుకు వెళ్తామని కూడా చెప్పారు బాబు.
* అప్పట్లో తప్పుడు నిర్ణయం
1999లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి పెద్ద పొరపాటు చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం సైతం చంద్రబాబును అనుసరించింది. ముందస్తు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంది. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి ఓడిపోయింది. కేంద్రంలో బిజెపి ఓటమి చవిచూసింది. ఇప్పటికీ నాటి నిర్ణయాన్ని తలచుకొని చంద్రబాబు బాధపడుతుంటారు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మరోసారి టీవీ డిబేట్ కార్యక్రమంలో ప్రస్తావించారు బాబు.