Velugulla Jogeswara Rao : జగన్ సర్కార్ జిల్లాలను పునర్విభజించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది.అటు తరువాత కూడా కొత్త జిల్లాల డిమాండ్లు, జిల్లా కేంద్రాల మార్పుపై అనేక రకాల విన్నపాలు వచ్చాయి. తమ నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో కలపాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా టిడిపి ఎమ్మెల్యే ఒకరు ఇలాంటి డిమాండ్ తో ముందుకు వచ్చారు. ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఉమ్మడి ఏపీ లోనే గోదావరి జిల్లాలకు మంచి గుర్తింపు ఉండేది. రాజకీయంగా గోదావరి జిల్లాలు ఎటువైపు మొగ్గితే.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చేది. అటువంటి గోదావరి జిల్లాలను పూర్తిగా విభజించారు.తూర్పుగోదావరి జిల్లాలో అయితే నాలుగు జిల్లాలుగా మార్చేశారు. ఆ జిల్లా పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు.. నాలుగు జిల్లాల్లోకి చేరిపోయాయి. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాస్త తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలుగా మారడంతో పాటు.. ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లిపోయింది. మండపేట కోనసీమలోకి వెళ్ళింది. రాజమండ్రి కి కూత వేటు దూరంలోనే మండపేట ఉంది.అందుకే మండపేట ను తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో చేర్చాలని అప్పట్లో కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు మరోసారి మండపేట టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఇదే డిమాండును తెరపైకి తెచ్చారు.
* మండపేట ఎమ్మెల్యే డిమాండ్
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నియోజకవర్గాలతో పాటు జిల్లాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడారు. మండపేట నియోజకవర్గాన్ని తిరిగి తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ విషయమై విపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తావించిన వైనాన్ని గుర్తు చేశారు. అందుకే వేరే ఆలోచనకు తావు ఇవ్వకుండా తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జోగేశ్వరరావు.
* అదే తరహా డిమాండ్లు
అయితే చాలా నియోజకవర్గాలను పూర్వపు జిల్లాల్లో కలపాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల పాలన నడుస్తోంది.పేరుకే జిల్లాల విభజన కానీ జిల్లా పరిషత్ లు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి.అయితే ఈ పరిస్థితుల్లోమళ్లీ ఇప్పుడు ప్రత్యేక జిల్లాల డిమాండ్లు రావడం,చేర్పులు మార్పులు చేయాలని వినతులు వస్తుండడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.