Nominated posts : సీనియర్లకు బిగ్ షాక్..నామినేటెడ్ పోస్టులు వారికే.. లీకైన లిస్ట్!

ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా చాలామంది టీడీపీ నేతలకు టికెట్లు దక్కలేదు. కొంతమంది సీనియర్లకు సైతం పక్కన పెట్టారు. ఈ తరుణంలో నామినేటెడ్ పోస్టులపై వారు ఆశలు పెట్టుకున్నారు.

Written By: Dharma, Updated On : August 12, 2024 12:40 pm

Naminated Posts

Follow us on

Nominated posts : ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో.. పదవులు సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట పార్టీకి 60 శాతం, జనసేనకు 40 శాతం, బిజెపికి పది శాతం కేటాయిస్తారని.. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట ఆ పార్టీకి 60 శాతం, టిడిపికి 40 శాతం, బిజెపికి 10 శాతం కేటాయిస్తారని.. బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నచోట ఆ పార్టీకి 50%, మిగతా రెండు పార్టీలకు 50 శాతం కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎల్లో మీడియాలో మాత్రం.. నామినేటెడ్ పదవుల్లో సింహభాగం టిడిపికేనని.. జనసేన తో పాటు బిజెపికి 20 శాతం లోపు పదవులు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. ఈనెల 16న నామినేటెడ్ పదవులను ప్రకటిస్తారని తెలుస్తోంది. కీలక పదవులకు సంబంధించి టిడిపి నేతల పేర్లు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ నుంచి కార్పొరేషన్ పదవుల దాకా టిడిపి కీలక నేతల పేర్లు బయటికి వస్తున్నాయి. టిడిపి వర్గాలు సైతం అదే విషయాన్ని చెబుతున్నాయి.అయితే మొదటి విడతలో 30% పదవులనే ప్రకటిస్తారని.. ముందుగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ తో పాటు ఒక 14 కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు మెంబర్ల పోస్టులకు ఉన్న ఖాళీలు భర్తీ చేస్తారని చెబుతున్నారు.

* టీటీడీ ఆశవహులు వీరే..
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖంగా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ సభ్యులుగా తెలంగాణ టిడిపి నేతలకు అవకాశం ఇస్తారని.. నర్సిరెడ్డి తో పాటు ప్రొఫెసర్ తిరునగరి జోత్స్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ నుంచి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, దినేష్ రెడ్డి, ఉత్తరాంధ్ర నుంచి కూన రవికుమార్, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.

* ఆర్టీసీ చైర్మన్ గా దేవినేని
మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కేటాయిస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన ఏపీఐఐసీ, పౌర సరఫరాల శాఖ, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టి కమిషన్లకు చైర్మన్లు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రొద్దుటూరు నుంచి టిడిపి టికెట్ ఆశించిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది.

* పట్టాభి కి ఛాన్స్
ఎన్నికల్లో టికెట్ ఆశించారు టిడిపి నేత పట్టాభి. కానీ ఛాన్స్ దక్కలేదు. ఆయనకు పౌరసరఫరాల శాఖ చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత ఎస్టి కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆలపాటి రాజాకు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

* తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనబాక
పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి కొత్త నియామకాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అందుకే తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలుగు యువత, విద్యార్థి, రైతు విభాగంతో పాటు అనుబంధ సంఘాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి.