Bandi Sanjay: బీజేపీ తెలంగాణలో అధికారం కోసం అన్ని దారులు వెతుకుతోంది. ప్రత్యర్థి పార్టీని అధికారానికి దూరం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బీజేపీ ఇప్పటికే రెండుసార్లు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించింది. ఇప్పుడు మూడో సారి కూడా నిర్వహించాలని చూస్తోంది. ఆగస్టు 2 నుంచి 28 వరకు 24 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో మూడో విడత పాదయాత్ర కొనసాగనుంది. ఇందులో అధికార పార్టీ విధానాలు ఎండగట్టి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరనున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరి పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి హాజరై జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొదట వరంగల్ నుంచి యాదాద్రికి చేపట్టాలని భావించినా తరువాత ప్లాన్ మార్చారు. యాదాద్రి నుంచి వరంగల్ వరకు కొనసాగించనున్నారు. పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని ఇదివరకే ప్రకటించిన బీజేపీ ఆ దిశగా ముందుకు సాగుతోంది.
బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా తొలి రోజు 10.5 కిలోమీటర్లు నడవనున్నారు. చివరి రోజు వరంగల్ లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ సత్తా చాటాలని భావిస్తోంది. అధికార పార్టీలో వణుకు పుట్టించాలని ప్రయత్నిస్తోంది. దీనికి గాను అన్ని మార్గాల్లో దూసుకెళ్లడానికి పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా మరోమారు గర్జించి వారి గుండెల్లో మంటలు రేపాలని నిర్ణయించింది. వరంగల్ సభతో మరో ప్రస్థానం మొదలవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
వరంగల్ సభ ద్వారా మరికొంతమందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నా దీనిపై ఆయన ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఇంకా కొందరు బీజేపీతో టచ్ లో ఉండటంతో వారిని ఈ సభలో పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. వీలైనంత వరకు ఎక్కువ మందిని పార్టీలోకి చేర్చుకుని పార్టీ ప్రతిష్ట మరింత పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.