Anna canteen : పేదలకు నామమాత్రపు ధరకే భోజనం అందించాలని టిడిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను తెరిచింది.ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనంఐదు రూపాయలకే అందించింది.2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో ఉండే అభాగ్యులు, పేదవారికోసం అన్న క్యాంటీన్లను చంద్రబాబు సర్కార్ ప్రారంభించింది. అప్పట్లో అక్షయపాత్ర ఫౌండేషన్ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఈ క్యాంటీన్లతో పేదలకు మంచి ఆహారం అందేది.వివిధ పనులపై పట్టణాలకు వచ్చే వారికి,చిరు వ్యాపారులకు, చిరుద్యోగులకు తక్కువ డబ్బులకే నాణ్యమైన ఆహారమందేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న కాంటీన్లను ఎత్తివేసింది. ఆ భవనాలను నిరుపయోగంగా మార్చేసింది.కొన్నిచోట్ల సచివాలయ భవనాలు వంటి ప్రత్యామ్నాయ అవసరాల కోసం వినియోగించింది. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి క్యాంటీన్లను తెరిచేందుకు నిర్ణయించారు. అయితే పరిస్థితులు తగ్గట్టు ఇప్పుడు ప్లాన్ మార్చారు. ఆగస్టు 15 నాటికి సగం క్యాంటీన్లను మాత్రమే తెరవన్నారు. క్రమేపి మిగతా క్యాంటీన్లను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో క్యాంటీన్లు తేవాలన్నది చంద్రబాబు ప్లాన్. ఈ క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని పవన్ నుంచి ప్రతిపాదన వచ్చింది. కానీ ఇప్పటికే అన్న క్యాంటీన్లుగా ప్రాచుర్యం పొందడంతో అదే పేరును కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు చేశారు.
* నామమాత్రపు ధరకే భోజనం
అప్పట్లో టిడిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 183 క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనాన్ని రూ.5లకే అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ క్యాంటీన్లను మూసేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మరో 80 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పనులు జరగకపోవడంతో ప్రభుత్వం ప్లాన్ మార్చింది.
* నిరుపయోగంగా భవనాలు
గత ఐదు సంవత్సరాలుగా ఈ క్యాంటీన్ భవనాలను నిరుపయోగంగా వదిలేశారు. దీంతో ఎక్కడికక్కడే భవనాలు పాడయ్యాయి. వాటిని వినియోగంలోకి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని చోట్ల పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అందుకే ఆగస్టు 15 నాటికి సగం క్యాంటీన్లను మాత్రమేప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆరోజు కేవలం 100 క్యాంటీన్లను మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
* సొంత డబ్బులతో నిర్వహించిన టిడిపి
వైసిపి ప్రభుత్వం ఈ క్యాంటీన్లను మూసేసింది. అయినా తెలుగుదేశం పార్టీ సొంత డబ్బులతో చాలాచోట్ల ఈ క్యాంటీన్లను కొనసాగించింది. ప్రజల్లో సైతం ఈ క్యాంటీన్ లపై ఒక సానుకూలత ఏర్పడింది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఆగస్టు 15న 100 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ లో మరో 83 క్యాంటీన్లను తెరవనున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 40 క్యాంటీన్లను సైతం వీలైనంత త్వరగా సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 220 క్యాంటీన్లతో విజయవంతంగా కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ కృతనిశ్చయంతో ఉంది.