TDP Telangana: తెలంగాణ టిడిపిపై చంద్రబాబు ఫోకస్.. అరవింద్ కుమార్ గౌడ్ కు కీలక బాధ్యతలు!

తెలంగాణ తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా నాయకత్వ బాధ్యతలు కీలక నేతకు అప్పగించాలని చూస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 29, 2024 4:59 pm

TDP Telangana

Follow us on

TDP Telangana: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం పై చంద్రబాబు ఫోకస్ పెట్టారా? కీలక నేతకు బాధ్యతలు అప్పగించనున్నారా? పార్టీలో చేరికలను ప్రోత్సహించనున్నారా? బిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు రానున్నారా? ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం తిరిగి టిడిపి గూటికి చేరనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అసలు పార్టీ బలపడుతుందా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయకత్వంలో టిడిపి మరోసారి అధికారంలోకి వచ్చింది.దీంతో తెలంగాణలో కూడా టిడిపి పుంజుకుంటుందన్న ఆశ వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్లో టిడిపి పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు టీటీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత నందమూరి కుటుంబ సభ్యులకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. హరికృష్ణ కుమార్తె సుహాసిని కి అధ్యక్ష పదవి ఇస్తారని టాక్ నడిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీసీ వర్గాలకే అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అరవింద్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేశారు. అప్పటినుంచి పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు దానిని భర్తీ చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ముందుగా అధ్యక్ష పదవిని భర్తీ చేసి.. టిడిపి కార్యకలాపాలు పెంచాలని.. అప్పుడే ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారు.

* కెసిఆర్ పార్టీ నిర్వీర్యం
తెలంగాణలో కెసిఆర్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. 2014లో తెలంగాణలో తొలిసారిగాఅధికారంలోకి వచ్చారు కెసిఆర్. అప్పటివరకు ఉద్యమ తెలంగాణపై దృష్టి పెట్టిన ఆయన.. బంగారు తెలంగాణ అంటూ హడావిడి చేయడం ప్రారంభించారు. టిఆర్ఎస్ లో పాలనపై అనుభవమున్న నేతలు తక్కువగా ఉండడంతో.. టిడిపి నుంచి చేరికలకు ప్రోత్సహించారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్, నామా నాగేశ్వరరావు, మల్లారెడ్డి… ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. నేతలంతా క్యూ కట్టారు టిఆర్ఎస్లోకి. వారంతా టిడిపిలో పదవులు అనుభవించిన వారే.

* టిడిపిలోనే కొనసాగుతున్న కొంతమంది నేతలు
అయితే చాలామంది టిడిపిలోనే కొనసాగుతున్నారు. పార్టీ అంటే అభిమానం, చంద్రబాబు అంటే గౌరవంతో ఇప్పటికీ నేతలు కొనసాగుతున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని వంటి నేతలు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. టీటీడీ పాలకమండలి సభ్యులుగా కొంతమంది తెలంగాణ నేతలకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

* బీసీ నేతకు అవకాశం
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ టిడిపికి అధ్యక్ష పదవి భర్తీ చేస్తారని తెలుస్తోంది. నందమూరి సుహాసిని కి ఆ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. బీసీ నేత అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ తరుణంలోనే అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ కు స్వయాన మేనల్లుడు. ఈయన ఏ పార్టీలో చేరకుండా టిడిపిలోనే కొనసాగుతూ వచ్చారు. అందుకే ఆయనకి ఇస్తే సముచితం అని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల అమరావతి వచ్చిన అరవింద్ చంద్రబాబును కలిశారు. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.