CM Jagan: వాపు చూసుకుని బలుపనుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. సంక్షేమ పథకాల పేరుతో మీట నొక్కి డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి పంపిస్తూ ఇక మా పని అయిపోయిందని హాయిగా క్యాంపు కార్యాలయానికి పరిమితమవుతున్నారు. నాయకున్న వాడు ప్రజల్లో తిరిగితేనే ప్రయోజనం ఉంటుందనే సంప్రదాయానికి చెల్లు చీటి ఇస్తూ తన ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తీరుపై అసహనం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లు కరోనా సాకుగా చూపి బయటకు రాని జగన్ ప్రస్తుతం బయటకు వచ్చినా ఫలితం కనిపించడం లేదు. ఇందుకు రచ్చబండను వేదికగా చేసుకుని ప్రజలను కలవాలని భావించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత పెరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఇప్పటివరకు ప్రజలను నేరుగా కలిసిన సందర్బాలు చాలా తక్కువే అని తెలుస్తోంది.
Also Read: ఆ నాలుగు మీడియా సంస్థలపై జగన్ నిషేధం.. కేసీఆర్ బాటలోనే సంచలనం
దీనికి తోడు పార్టీ నాయకులకు ఎలాంటి పనులు లేకుండా పోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదు. దీంతో వారు కూడా ప్రజలను కలిసేందుకు ధైర్యం చేయడం లేదు. జగన్ కూడా ప్రజలను కలవాలని చూస్తున్నా అక్కడ వారికి ఏవో హామీలు ఇవ్వాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే భావించి దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
పార్టీ నేతల్లో కూడా అసహనం పెరుగుతోంది. పార్టీ కోసం ఏ ప్రతిఫలం లేకున్నా ఎందుకు పనిచేయాలనే భావం అందరిలో కలుగుతోంది. ఇన్నాళ్లుగా పార్టీని నమ్ముకున్నా ఏ చిన్న లాభం కూడా జరగకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇక పార్టీని నమ్ముకోవడం తగదని ఆలోచిస్తున్నారు. వేరే మార్గాలు చూసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్ బయట పరిస్థితిని అర్థం చేసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళితేనే ప్రయోజనం ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: ఉద్యోగులను పీఆర్సీపై సీఎం జగన్ బెదిరించాడా? బతిమాలాడా?