Amazon Prime: ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ+ డిస్నీ హాట్‌స్టార్ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ ధరలను 50 శాతం పెంచనుంది. దీంతో ప్రస్తుతం ప్రైమ్ ధర ఏడాదికి రూ.999 ఉండగా…పెరగనున్న ఛార్జీలతో అది కాస్తా రూ. 1499కి చేరనుంది.
అదేవిధంగా నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ రూ.129కే అందుబాటులో ఉండగా … రూ.50 పెరిగి అది కూడా రూ.179కి చేరుకోనుంది. ఇక క్వార్టర్టీ సబ్‌స్ర్కిప్షన్ ధర రూ. 329 నుంచి రూ. 459కి పెరగనుంది. ఇప్పటికే ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్న వారు కాలపరిమితి పూర్తయ్యే వరకు ఉపయోగించుకోవచ్చునని…ఆ తర్వాత పెరిగిన ధరల ప్రకారమే రెన్యూవల్ చేసుకోవాలని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. అయితే ధరలు పెంచడానికి గల కారణాలు, పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.
డిస్నీ హాట్‌స్టార్ బాటలోనే!
ఇదిలా ఉంటే…ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్ షాపింగ్ యాప్‌లో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వివిధ ఫెస్టివల్ సేల్స్ సమయాల్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఒక రోజు ముందుగానే ఆఫర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ధరతో సంబంధం లేకుండా ఉచిత హోం డెలివరీ సదుపాయం ఉంది. కొన్ని ఈ-బుక్స్‌ను ఉచితంగా చదువుకోవచ్చు. వీటితో పాటు అమెజాన్ ఓటీటీలో విడుదలైన సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. అయితే సబ్‌స్ర్కిప్షన్ ధరలు పెంచాలన్న అమెజాన్ నిర్ణయంపై కొందరు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో కొందరు వినియోగదారులు తమ సబ్‌స్ర్కిప్షన్‌ను వదులుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.