ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి
ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రచార మాధ్యమాలు, వినియోగదారులు చివరకి యజమాని అయిన ప్రభుత్వం కూడా అవకాశం దొరికితే ప్రభుత్వరంగ బ్యాంకుల మీద ఒంటికాలితో లేవటం సర్వసాధారణం. కానీ అవి ఎదుర్కుంటున్న సవాళ్ళ గురించి , సామాజిక, ఆర్ధిక పరివర్తనలో వాటి పాత్ర గురించి ఎవరూ మాట్లాడరు. చివరకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో వున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు విలీనాలు సమస్యకు పరిష్కారంగా చూపటం తెలిసిందే. అదే ఇప్పుడు ప్రైవేటీకరణ పరిష్కారమని చెప్పటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తూంది. ఇందులో నిజానిజాలు , అసలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అసలు సమస్యలు పక్కదారిపట్టే ప్రయత్నం
మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుతం 12 బ్యాంకులు గా మిగిలాయి. ఇందులో ఆరు బ్యాంకులు విలీనం బారినపడకుండా మిగిలిపోయినవే వున్నాయి. వీటిల్లో కొన్ని నిర్దిష్ట సూత్రాలను పక్కనపెట్టి ఎడాపెడా రుణాలు మంజూరు చేయటంతో 20నుంచి 25 శాతం నిరర్ధక అస్తులతో కునారిల్లుతున్నవే. వీటిని ప్రైవేటీకరణ చెయ్యాలన్నా కొనే వారు దొరక్కపోవచ్చు.ఇది కూడా ఇంకో ఎయిర్ ఇండియా ప్రహసనం లాగే మిగిలిపోవటం ఖాయం. మొత్తం మీద ఈ విలీనప్రక్రియలో నష్టపోయింది తెలుగు రాష్ట్రాలే. విలీనాలకు ముందు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ , ఆంధ్ర బ్యాంకులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేవి. ఇప్పుడు బ్యాంకింగ్ రంగం లో హైదరాబాద్ పేరు కనుమరుగయ్యింది. నిజాం స్థాపించిన స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ , ప్రముఖ స్వాతంత్ర యోధుడు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్ర బ్యాంకు పేర్లు చరిత్రలో సమాధి అయిపోయాయి. విశేషమేమంటే దేశంలోని అన్ని మెట్రోల్లో బ్యాంకు ప్రధాన కార్యాలయాలు వున్నాయి ఒక్క హైదరాబాద్ లో తప్ప. బెంగుళూరు తో సరిసమానంగా అభివృద్ధిలో పోటీపడుతున్న హైదరాబాద్ లో ఒక్క బ్యాంకు ప్రధాన కార్యాలయం లేకపోవటం శోచనీయం.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సమస్యలకు విలీనమో, ప్రైవేటీకరణమో పరిష్కారమయితే ఆనందంగా ఒప్పుకోవచ్చు. మరి ప్రైవేటు బ్యాంకు ఎస్ బ్యాంకు, పిఎంసి బ్యాంకు సంక్షోభానికి ఏమి కారణం? కాబట్టి, బ్యాంకులు ఎదుర్కుంటున్న సమస్యలకు పక్కదారి పట్టించే పరిష్కారాల కన్నా లోతుగా విశ్లేషించి పరిష్కారమార్గాలు కనుక్కోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. యజమాని తరఫున ప్రభుత్వ డైరెక్టర్ , నియంత్రణను పర్యవేక్షించే రిజర్వు బ్యాంకు డైరెక్టర్ ప్రభుత్వరంగ బ్యాంకు బోర్డులో ప్రత్యక్షంగా హాజరు అవుతున్నప్పుడు వైఫల్యాలపై ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకు కి బాధ్యతలేదా? ప్రైవేటు బ్యాంకులపై రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ వున్నప్పుడు అక్కడ వైఫల్యాలకు కారణాలేమిటి? కాబట్టి ఎవరు యజమాని అనే విషయం కన్నా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారనేది ముఖ్యం.
ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కుంటున్న సవాళ్లేమిటి?
మార్కెట్ లో క్రమక్రమేణా ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా తగ్గి ప్రైవేటు బ్యాంకుల వాటా పెరుగుతున్నమాట వాస్తవం. అందులో దాపరికమేమీ లేదు. అయితే దానికి కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ప్రైవేటురంగంలో ఎంత ఆర్ధిక నైపుణ్యమున్న వారు వున్నారో ప్రభుత్వరంగంలో వారికన్నా ఎక్కువ సమర్ధులకు కొదవలేదు. ఎందుకంటే ఇక్కడివారే అక్కడకు వెళ్లి బ్యాంకులను వున్నత స్థానాలకు తీసుకెళ్ళారు. కాబట్టి అది సమస్యకాదు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిపాలనలో, నిర్ణయాల్లో రాజకీయనాయకుల జోక్యం, ప్రభుత్వ అధికారుల ప్రభావం బహిరంగ రహస్యమే. రుణ వితరణలో దీనివలన దుష్ఫలితాలు బ్యాంకులకు భారంగా మారటం కూడా బహిరంగ రహస్యమే. తీసుకున్న రుణాలు ఎగవేయటం, కంపెనీలు దివాలా తీసినా వీటి అధిపతులు సంపదను పోగేసుకోవటం కూడా బహిరంగ రహస్యమే. ఇంతవరకూ ఎంతమంది ఆర్ధిక నేరస్థులు శిక్షలనుభవిస్తున్నారు? సమస్యల్లా ఇక్కడేవుంది. ఒకవేళ వాళ్ళపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినా దాని విచారణ పూర్తికావటానికి జీవితకాలం పడుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఆర్ధిక నేరస్థులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ జరపాలి. అందుకనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. దివాలా కోరు చట్టం ద్వారా కేసు పరిష్కారంలో కొంత పురోగతి వున్నా, ఆర్ధిక నేరగాళ్ళను శిక్షదాకా తీసుకెళ్లటంలో మన వ్యవస్థ వెనకబడి వుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులు సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని ప్రభుత్వ భారాన్ని తాము మోయటం కూడా ఓ ప్రధాన కారణం. ప్రైవేటు బ్యాంకులు లాభార్జనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు వెనకబడిన ప్రాంతాల్లో, కుగ్రామాల్లో కూడా శాఖలు తెరిచి సేవ చేయటం తెలిసిందే. మరి ఈపని ప్రైవేటురంగ బ్యాంకులు చేయటం లేదుకదా. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తో కలిసి రుణ వితరణ ప్రణాళికలు తయారుచేసి అమలుచేయటంలో ప్రధాన భూమిక ప్రభుత్వరంగ బ్యాంకులు చేస్తున్నాయి. మరి ఈపని ప్రైవేటురంగ బ్యాంకులు చేయవు కదా. ఉదాహరణకు వీధి వ్యాపారస్తులకు యాభై లక్షల మందికి పదివేల రూపాయల చొప్పున రుణాలు ఇవ్వాలని ఇటీవల ప్రకటించిన పేకేజీ అమలుచేసేది ప్రభుత్వరంగ బ్యాంకులే కదా. ఇవి చేసే పనిని కొలవటానికి సరైన సాధనాలు లేవు. బ్యాంకుల పనితీరుని మదింపు చేయటానికి లాభమొక్కటే లెక్కతీసుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులతో సరితూగలేవు. ఎందుకంటే దీని మానవ వనరులను ప్రాధమిక బ్యాంకు పనికే కాకుండా మిగతా సామాజిక లక్ష్యాలకు వాడుకోవటం జరుగుతోంది. ప్రభుత్వ లక్ష్యాల కనుగుణంగా షుమారు 35 కోట్ల జన ధన ఖాతాలను తెరవటం జరిగింది. ఇవి వాణిజ్య లక్ష్యాలతో ముడిపెడితే లాభసాటి కాకపోవచ్చు. సామాజిక లక్ష్యాలతో ముడిపెడితే ఎంతో లాభం. ప్రైవేటు బ్యాంకులు వచ్చిన లాభాలతో సాంకేతికతను అభివృద్ధి చేసుకొని పనివిధానాన్ని మెరుగుపరుచుకోగలిగితే పరిమిత వనరుల్ని ఉపయోగించుకొని ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకొని పోటీలో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రైవేటు బ్యాంకులకు సమతుల్య పోలిక లేదు. ప్రభుత్వరంగ సిబ్బంది జీతభత్యాలకు ప్రైవేటు బ్యాంకుల జీతభత్యాలకు హస్తిమసికాంతం తేడా వుంది. వేతన పోలిక లేకపోగా రోజువారీ నిర్ణయాల్లో భయం భయంగా పనిచేయాల్సి వుంది. ఏ మాత్రం చిన్న తప్పుజరిగినా ప్రభుత్వ నిఘా సంస్థల నియంత్రణలోకి వెళ్ళాల్సి వస్తుందనే భయం వెంటాడుతుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఆ భయం లేదు. అవసరమైన చోట రిస్కు తీసుకునే స్వాతంత్రం వాళ్ళకు వుంది. వివిధ సందర్భాల్లో ఆర్దికమంత్రులు అటువంటి భయం అవసరం లేదని హామీలు ఇస్తూ వచ్చినా ఆచరణలో వీరి అనుభవం వేరేలా వుంది. ఇటీవలికాలంలో కొన్నిమార్పులు జరిగినా ఇప్పటికీ ఆ కత్తి మెడ పై వేలాడుతూనేవుందనే భయం అధికారులలో పోలేదు. అదేసమయంలో విజయ మాల్యాలు, నీరవ్ మోడీలు లాంటి మోసగాళ్ళకు సహకరించే వాళ్లకు తీవ్ర శిక్షలు వుండాల్సిందే. కాకపోతే దాన్నడ్డం పెట్టుకొని ప్రభుత్వ నియంత్రణ పెరిగేకొద్దీ వాణిజ్య నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది. దీన్ని సున్నితంగా, సమర్ధవంతంగా నిర్వహించవలసి వుంది.
ఇకపోతే రాజకీయపార్టీలు రుణ మాఫీ పేరుతో ఇచ్చే వాగ్దానాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. రుణ వసూలు వాతావరణం ఇటీవలికాలంలో పూర్తిగా దెబ్బతింది. రిజర్వు బ్యాంకు ఎన్నోసార్లు హెచ్చరించినా ఈ విధానం మారలేదు. ప్రభుత్వం ఆర్ధికంగా దెబ్బతిన్న ప్రజలకు ఉపశమనం కల్గించటం తప్పుకాదు అయితే అది బ్యాంకుల ఆర్దికమూలాలపై దెబ్బతీసే విధంగా వుండకూడదు. రుణ వసూలు క్రమ శిక్షణకు భంగం కలగ కూడదు. ఇది ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే రాను రాను ప్రభుత్వ చర్యలు బ్యాంకుల పనితీరుని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలును మెల్లి మెల్లిగా బ్యాంకులపై మోపుతుంది. దీనితో బ్యాంకులు వాటి ప్రాధమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు సమయం వెచ్చించ లేకపోతున్నాయి. గ్రామీణ, పట్టణ బ్యాంకుల్లో ఈ పనిభారం పెరగటం వలన బ్యాంకు సిబ్బంది సాధారణ బ్యాంకు కార్యకలాపాలు నిర్వర్తించలేకపోతున్నారు. ఇవి మరో ప్రభుత్వ కార్యాలయాలుగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతయినా వుంది.
ఇటీవలికాలంలో చేపట్టిన సంస్కరణలు
ఇటీవలికాలంలో ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్నో సంస్కరణలు అమలుచేసింది. ఇన్ని సవాళ్లు, ఇబ్బందుల్లో కూడా ప్రభుత్వరంగ బ్యాంకులు సంస్కరణల నేపధ్యంలో ఎంతో మెరుగైన పనితీరుని కనబర్చాయి. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నియామకాలన్నీ బ్యాంకు బోర్డు బ్యూరో ని ఏర్పరిచి దానిద్వారా చేపట్టింది. ఇందులో ప్రభుత్వ అధికారులు కన్నా నిపుణులే ఎక్కువమంది వున్నారు. నిరర్ధక ఆస్తుల గుర్తింపు ప్రక్రియను మరింత పకడ్బందీగా, పారదర్శకంగా చేయగలిగారు. రుణ ప్రతిపాదన మదింపు ప్రక్రియను మెరుగుపర్చారు. కావాలని ఎగ్గొట్టిన వారి జాబితాదారులను గుర్తించటంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు రుణ వితరణ ఆపివేయటంలో తప్పనిసరి పద్ధతుల్ని తీసుకొచ్చారు. సాంకేతికతను అభివృద్దిచేసి విరివిగా వాడుకలోకి తీసుకురావటం, డిజిటల్ మౌలిక సదుపాయాల్ని, రుణ వితరణను అమలుచేయటంతో పోటీ మార్కెట్లో మరింత మెరుగైన ఫలితాల్ని సాధించగలుగుతున్నారు.
నిరర్ధక ఆస్తుల్ని తగ్గించుకోవటం లో ఇటీవలి కాలంలో మంచి పురోగతిని సాధించగలిగారు. గత సంవత్సరంతో పోలిస్తే 14.6 శాతం నుంచి సెప్టెంబర్ 2019 కి 11.6 శాతానికి తగ్గించుకోగలిగారు. అదే నికర నిరర్ధక ఆస్తుల విషయం లో 8 శాతాన్నుంచి 4.8 శాతానికి తగ్గించుకోగాలిగారు. మొత్తం అప్పుల్లో 53 శాతం 5 కోట్ల రూపాయల పైబడిన పెద్ద అప్పుదారులవే. నిరర్ధక ఆస్తుల్లోనయితే 82 శాతం వారివేనని గమనించాలి. అదేవిధంగా బ్యాంకుల నిర్వహణ లాభాలు కూడా పెరిగాయి. అదేసమయంలో కొత్తగా నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరే జాబితా తగ్గింది. 2 సంవత్సరాల తర్వాత లాభాల బాటలో పయనించాయి. దివాలాకోరు చట్టం అమలుతో రుణ వసూళ్ళ వాతావరణం మెరుగుపడింది. ప్రభుత్వ మూలపెట్టుబడి నిధుల సహాయం కూడా ప్రభుత్వ బ్యాంకుల ఆర్దికపరిస్థితి మెరుగుపడటానికి దోహదపడింది. రిజర్వు బ్యాంకు ఇటీవలే కార్పోరేట్ గవర్నెన్స్ మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. వీటితోపాటు ప్రభుత్వం ఇప్పటికే ఈజ్ ఇండెక్స్ ని, క్లీన్ బ్యాంకింగ్ సంస్కరణలను, స్మార్ట్ బ్యాంకింగ్ పనివిధానాన్ని అమలుచేయటం తో ప్రభుత్వరంగ బ్యాంకుల పనివిధానం మెరుగుపడింది.
అయితే కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపధ్యంలో ఏర్పడిన ఆర్ధిక మాంద్యంతో తిరిగి నిరర్ధక ఆస్తులు పెరిగే ప్రమాదం మెండుగా వుంది. నిధుల లభ్యత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా రుణ వితరణ సజావుగా సాగటం గగనమే. కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తుల జాబితాకు అదనంగా చేరే అవకాశాలే మెండుగా వున్నాయి. ఆటో రంగం, హోటల్, పర్యాటక రంగాలు కుదేలుమనటంతో ఆ రుణాల చెల్లింపు వాయిదాలు బ్యాంకులకు వచ్చే అవకాశాలు లేవు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థ అధిక ఒత్తిడిలో వుంది. ప్రభుత్వం ప్రకటించిన 90వేల కోట్లు పంపిణీ సంస్థలు వాడుకున్నా అవి ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితి లేదు. దానితో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు బ్యాంకులకు చెల్లించాల్సిన కిస్తీలు సకాలంలో చెల్లించటంలో ఇబ్బందు లేర్పడే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇలా ప్రతిరంగం ఒడిదుడుకుల్లో ఉండటంతో బ్యాంకుల ఆర్ధిక పరిస్థితి తిరిగి ఇబ్బందుల్లో పడబోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతికూల వాతావరణంలో పనిచేయాల్సివస్తుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటుపరం కాబోతున్నాయా?
ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు సుబ్రహమణ్యం మాటల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విలీనాలు ఇంకా కొనసాగుతాయని సెలవిచ్చాడు. అలాగే ప్రైవేటీకరణపై కూడా పరోక్షంగా సంకేతాలిచ్చాడు. కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ఆలోచన ప్రభుత్వానికి వున్నట్లు తెలుస్తుంది. అందరూ అనుకుంటున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ జనాభిప్రాయానికి వెరచో, యూనియన్ల ఒత్తిడికి భయపడో ప్రభుత్వం వెనకాడటం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వ అవసరాలను తీరుస్తున్నాయి కాబట్టే కొనసాగ్గిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో ఆ పనికి తెరతీసేవారు. ప్రభుత్వరంగ బ్యాంకులు లేకపోతే ప్రభుత్వ ఆర్ధిక , సామాజిక లక్ష్యాలు నెరవేరటం కష్టం కాబట్టే అందుకు పూనుకోవటం లేదనేది వాస్తవం. కాకపోతే బాగా నష్టాల్లో వున్న బ్యాంకుల్ని వదిలించుకోవాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. అంటే పాలు ఇచ్చినంతవరకు ఆవుని వుంచుకొని తర్వాత అమ్మేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనుకోవాలి. అసలు సమస్య యాజమాన్యం కాదు యాజమాన్య పద్ధతులని ప్రభుత్వం గ్రహించాలి.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: All out attack on public sector banks
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com