పవన్ కళ్యాణ్ ఇటీవల కాపులకి సంబంధించిన రెండు విషయాలపై ట్విట్టర్ లో స్పందించటం వివాదాస్పద మయ్యింది. అవి ఒకటి, కాపు సంక్షేమం కోసం గత 13 నెలల్లో రూ.4770 కోట్లు ఖర్చుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించటంపై, రెండోది, కాపు రిజర్వేషన్ల అంశంపై. దానికి ప్రతిగా వై ఎస్ ఆర్ పార్టీ మొత్తం ఆ పార్టీ లోని కాపు నాయకుల్ని రంగంలోకి దింపింది. అంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కాపు కులానికి సంబంధించిన వాడు కాబట్టి కాపు కుల నాయకులతోనే తిట్టించాలి. ఇది అదివరకు చంద్రబాబు నాయుడు చేసాడు, ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. ఆరోజు చంద్రబాబు నాయుడు ఇలా కులంలో చిచ్చు పెట్టటాన్ని జగన్ తప్పు పట్టాడు. ఇప్పుడు అదే అస్త్రాన్ని తనూ వాడుతున్నాడు. అంటే అటు చంద్రబాబు నాయుడు కైనా ఇటు జగన్ కైనా కాపుల్ని ఎలా తికమకల్లో పెట్టాలనే విషయంలో ఒకే ఆలోచన, ఒకే దారి. పవన్ కళ్యాణ్ అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఆయన అట్లా ఇట్లా అని ఎదురుదాడి చేయటం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అడిగినదాంట్లో నిజముందనిపిస్తుంది. లేకపోతే ఇంత గాభరా ఎందుకు పడుతున్నారనే సందేహం కలుగుతుంది? అసలు విషయమేమిటో చూద్దాం.
ముందుగా జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాపు సంక్షేమాన్ని గురించి పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లోని గత ప్రభుత్వం కాపులను మచ్చిక చేసుకోవటానికి కాపు కార్పోరేషన్ ని ఏర్పాటు చేసింది. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పింది. 2019 ఎన్నికల్లో జగన్ ఇంకొంచెం ముందుకెళ్ళి సంవత్సరానికి 2 వేల కోట్ల రూపాయల చొప్పున అయిదు సంవత్సరాల్లో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పాడు. మరి జరిగిందేమిటి? జగన్ ప్రభుత్వం సంవత్సరం లో 2 వేలేమిటి ఖర్మ ఏకంగా 4 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసినట్లు ప్రకటన ఇచ్చుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కాపు కార్పొరేషన్ కి ఇస్తామన్న 2 వేల కోట్లు ప్రత్యేకమా కాదా అని ప్రశ్నించాడు. అంటే ప్రభుత్వం అందరికోసం ప్రకటించిన సంక్షేమ పధకాలకు ఇది అదనమా లేక ఆ సంక్షేమ పధకాల్లో భాగమా అని సందేహం వెలిబుచ్చి వివరణ అడిగాడు. వీటిపై ఒక శ్వేత పత్రం ప్రకటించమని కోరాడు. అలాగే కాపు నేస్తం పధకం లబ్దిదారులు కేవలం 2.35 లక్షలమంది మాత్రమే నని ప్రకటించటం పై సందేహం వెలిబుచ్చాడు. వీటికి సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయటం , అదీ ఆ పార్టీ లోని కాపు నాయకులచేత తిట్టించటం జగన్ కి నష్టం తప్పితే లాభం కాదు. కాపు జనాభా రాష్ట్రంలోనే అత్యధికమని సామాజిక గణాంకాలు చెబుతుంటే ,45-60 సంవత్సరాల మధ్య కాపు స్త్రీలు రాష్ట్రం మొత్తం మీద కేవలం 2.35 లక్షలు మాత్రమేనని చెప్పటం ఎవరికైనా సందేహం కలగక మానదు. మీ లెక్కలు ఎంత శాస్త్రీయమో వివరించాల్సింది పోయి తిట్ల దండకం మొదలుపెట్టటం లోనే మీ ప్రతిస్పందనలోని డొల్ల తనం తెలుస్తుంది.ఇకపోతే కాపు కార్పొరేషన్ కి నిధులు సాధారణ పధకాలతో సంబంధం లేకుండా కేటాయించాలి. అంతేగాని అందరి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పధకాల్ని కలిపి మీకు 4770 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పటం కాపుల్ని మోసం చేయటమేకదా. కాపు కార్పోరేషన్ కి కేటాయించిన, ఖర్చుచేసిన ప్రత్యేక నిధులు, సంక్షేమ పధకాలు చెప్పమంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తరఫున అడుగుతున్నాడని చెప్పటం సమస్యను పక్కదారి మళ్ళించి జవాబు దాటవేయటమే. ఇప్పటికైనా జవాబు ఇవ్వండి. లేకపోతే వై ఎస్ ఆర్ పార్టీలోని కాపు నాయకులు జగన్ ని కాపుకాయటం కోసం కాపుల్ని మోసం చేసినట్లే అవుతుంది.
ఇక రెండో విషయానికొద్దాం. కాపు రిజర్వేషన్లకు సంబంధించినది. అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేమిటో అర్ధంకావటం లేదు. కాపు రిజర్వేషన్లపై క్లుప్తంగా జరిగిన చరిత్రని ఏకరువు పెట్టి 2019 ఎన్నికలముందు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయమని కోరారు. ఇందులో తప్పేముంది? ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో వివరించాల్సింది పోయి బిసి రిజర్వేషన్ చరిత్రను దీనికి లింక్ చేసి మాట్లాడటం కాపుల్ని అయోమయానికి గురిచేయటమే. బిసి రిజర్వేషన్ సాధ్యంకానప్పుడు ఇబిసి లో ఈ 5 శాతం ఎందుకు సాధ్యం కాదో చెప్పకుండా సమస్యను పక్కదారి పట్టించటం చూస్తుంటే జగన్ కి ఈ రిజర్వేషన్ ఇవ్వటం ఇష్టం లేదని అర్ధమవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పులేదు.
ఇక వై ఎస్ ఆర్ పి ఎదురుదాడిలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కాపుల తరఫున ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించే హక్కు మీకుంది, కాదనటంలేదు. కాకపోతే దానికి దీనికి ముడి పెట్టటమేమిటి? పవన్ కళ్యాణ్ ఈ విషయం లో మొదట్నుంచీ స్పష్టత లో వున్నాడు. తనని ఒక కులానికి ఆపాదించవద్దని తను అందరివాడనని చెప్పాడు. ఇప్పుడు కూడా కాపు కులం తరఫున మాట్లాడుతున్నానని చెప్పలేదు. కాపు కులస్థుల విషయంలో చేసిన వాగ్దానాలు, ప్రస్తుత అమలు పై మాట్లాడితే తప్పేలా అవుతుంది. ఎస్ సి, ఎస్ టి , బిసి కార్పోరేషన్ నిధులపై అవక తవకలు జరిగితే అందరూ మాట్లాడతారు. ఇదీ అంతే. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తే సమస్యను పక్కదారి మళ్లించటం, పార్టీలోని కాపు నాయకులచేత తిట్టించటం చూస్తుంటే చంద్రబాబు నాయుడు చేసినపనే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నాడని అందరికీ అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ రెండు విషయాల్లో తెలుగుదేశం తరఫున మాట్లాడినట్లు ఎలా అవుతుంది? అంటే ప్రభుత్వం చేసే పనుల్ని ఎత్తిచూపితే తెలుగుదేశాన్ని సమర్ధించినట్లా? అంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెలుగుదేశానికి మాత్రమే వుందని జగన్-చంద్రబాబు రహస్య ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా అని ముక్కున వేలేసుకోవటం ప్రజల వంతయ్యింది. వై ఎస్ ఆర్ పి లోని కాపు నాయకులు ఉన్నదీ లేనిదీ కల్పించి పవన్ కళ్యాణ్ పై ఇలా బురదచల్లటం అదీ ఎవరిమెప్పుకోసమో ఇలా చేయటం కాపుల్లో ఆలోచనని రేపుతుంది. చంద్రబాబైనా , జగన్ మోహన్ రెడ్డయినా మాకు చేసిందేమీలేదు అనే నిర్ధారణకు కాపులు వచ్చినరోజు మూడో ప్రత్యామ్నాయం ఆంధ్ర రాజకీయాల్లో రావటం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు లాగా ఇటువంటి కుటిల రాజకీయాలు చేస్తే జరిగేది అదే. ఇంకా నాలుగు సంవత్సరాలు టైముంది. ఇప్పటికైనా కాపుల విషయంలో నిజాయితీ రాజకీయాలు చేస్తే మంచిది. లేకపోతే వాళ్ళలో తిరుగుబాటు తప్పదు. అప్పుడు ఈ రెండు పార్టీల్లోని కాపు నాయకులు వాళ్ళను కాపాడలేరు. అది గమనించి మసులుకుంటే మంచిది.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Pavan kalyan was under attack from jagans army
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com