Tamarind Tree: అది ఒక మహావృక్షం. 150కి పైగా ప్రజల ప్రాణాలను కాపాడింది. మూసీ వరదలకు ఎదురొడ్డి నిల్చుంది. నీటి ప్రకోపానికి అడ్డు కట్ట వేయడం ఎవరికైనా సాధ్యపడుతుందా? ఒకే ఒక్కడు పరమశివుడే కావచ్చు కదా.. ఏదో చిన్న కుంటే కదా..? అని తక్కువగా చూస్తే ఒక్క వర్షంతో అది చెరువై, సమీపంలోని అన్నింటిని తనలో కలిపేసుకోవచ్చు. అదే నదులైతే కొన్ని వందల ఎకరాలు, వేలాది ప్రాణాలను తనలో కలిపేసుకుంటుంది. ఈ ప్రవాహాలకు ఎదురెళ్లి నిలబడడం దాదాపు దేనికీ సాధ్యం కాదేమో. కానీ, ఇది ఒక చెట్టుకు సాధ్యమైంది. అదే ‘చింత చెట్టు’ హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలో ఉన్న చింత చెట్టు. వరదలను తట్టుకొని నిలబడింది. నిలబడడమే కాదు.. వందలాది మంది ప్రాణాలను కాపాడింది కూడా.. 1908లో మూసీకి వరదలు వచ్చాయి. ఎంత పెద్దగా మూసీ చరిత్రలోనే ఇవి భారీ వరదలు కావచ్చు. 1908, సెప్టెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి. 36 గంటల్లో దాదాపు 16 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో మూసీకి వరదలు వచ్చాయి. ఈ భారీ విపత్తుతో 15వేల మంది మరణించగా.. 20 వేల ఇళ్లను నది కూల్చివేసింది. మూసీకి వరదలు ప్రారంభమైన మూడో రోజు అంటే సెప్టెంబర్ 28న మరింత భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మూసీ 60 అడుగుల ఎత్తులో ప్రవహించింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. 36 గంటల్లో 16 సెంటీ మీటర్ల వర్షం పడింది. తమను తాము కాపాడుకునేందుకు వందలాది మంది పేట్ల బురుజుపైకి ఎక్కారు. కానీ అది కూడా 2 గంటల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.
అఫ్జల్ దవాఖాన (ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్) భవనం ఆవరణలో ఉన్న చింత చెట్టు మాత్రం మూసీ ప్రవాహాన్ని తట్టుకొని నిలబడింది. మూసీకి వరదలు వచ్చి ఇప్పటికి 116 వసంతాలు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ చింత చెట్టు పచ్చగా కలకలలాడుతుంది. పైగా దానికి ఇప్పటికీ చింతకాయలు కాస్తున్నాయి. మూసీ వరదల సమయంలో ఈ చెట్టు 150కి పైగా ప్రాణాలను కాపాడింది. అందుకే ఇప్పటికీ మూసీ వరదల్లో మరణించిన వారికి ఈ చెట్టువద్దే నివాళులర్పిస్తుంటారు.
ఈ చెట్టు కాపాడిన ప్రాణాలు దాదాపు ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఈ చెట్టు మాత్రం పది కాలాల పాటు సజీవంగా హైదరాబాద్ నగర ప్రజల గుండెల్లో ఉంటుంది. ఒక్కప్రాణం కాపాడితేనే ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో ఈ చెట్టు చేసిన మేలు ఎన్నటికీ మరిచిపోలేం. హైదరాబాద్ మూసీ వరదల కు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చెట్టు గురించి ప్రస్తావిస్తేనే అది పూర్తవుతుంది.