HomeNewsమోడీపై మధ్యంతర తీర్పు మూడు రోజుల్లో

మోడీపై మధ్యంతర తీర్పు మూడు రోజుల్లో

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు 10వ తేదీన వెల్లడికానున్నాయి. అందరూ ఫలితం ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇవి ఓ విధంగా దేశవ్యాప్త మినీ ఎన్నికలుగా పరిగణించవచ్చు. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రజలనాడి మోడీ ప్రభుత్వంపై ఎలా వుందో తెలుసుకునే అవకాశం ఈ ఎన్నికల్లో వుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్,గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రజలేమనుకుంటున్నారనేది స్పష్టం కానుంది. వీటితోపాటు తెలంగాణాలో కెసిఆర్ పై కూడా ప్రజలేమనుకుంటున్నారో దుబ్బాక ఎన్నిక ఫలితంతో తేలనుంది. అందుకే ఈ ఫలితం అత్యంత ఆసక్తిగా మారింది.

మధ్యప్రదేశ్ లో ఒకేసారి 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అంటే 10 శాతానికి పైగా అసెంబ్లీ స్థానాల్లో ప్రజల తీర్పు రానుంది. ఇందులో ఒక్క గ్వాలియర్ ప్రాంతంలోనే 16 స్థానాలున్నాయి. ఇవి బిజెపిలోకి కొత్తగా చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు అగ్ని పరీక్షగా మారాయి. వీటి భవిత్యంపై తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి వుంది. అలాగే ఆ ప్రాంతానికే చెందిన కేంద్రమంత్రి తోమర్ కి కూడా ఇవి ముఖ్యమైనవే. ఆ తర్వాత చెప్పుకోదగ్గవి గుజరాత్ ఎన్నికలు. ఇక్కడ 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువభాగం కాంగ్రెస్ గెలిచిన స్థానాలే. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి బిజెపి లోకి మారిన జంప్ జిలానీలు. ప్రజలు ఈ చర్యని ఏవిధంగా చూస్తారో తెలిపే ఎన్నికలివి. ఆ తరవాత ఉత్తరప్రదేశ్ లో జరిగే 7 అసెంబ్లీ స్థానాలు. 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకి ముందు యోగి ఆదిత్యనాథ్ పై జరిగే రెఫరెండంగా చెప్పొచ్చు. ఇందులో ఏడు అసెంబ్లీ స్థానాలు ఇంతకుముందు బిజెపి గెలుచుకున్నవే. ఒకటి సమాజ్ వాది పార్టీ గెలిచినది. కాబట్టి ఇందులో బిజెపికి ఇవి ప్రతిష్టాత్మకం. మిగతా రాష్ట్రాల్లో రెండు, ఒకటి చొప్పున వున్నాయి కాబట్టి అవి అంత ప్రభావితం చూపించక పోవచ్చు. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ప్రజలనాడి ఎలా వుందో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేమంటే ఈ ఉప ఎన్నికల వలన ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాల భవిత్యానికి  వచ్చే నష్టమేమీ వుండదు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో 28 లో 7 గెలిచినా ప్రభుత్వం నిలబడుతుంది. మిగతా రాష్ట్రాల్లో అదికూడా లేదు. కేవలం ప్రజలనాడి తెలుసుకోవటానికే ఉపయోగపడుతుంది. అదేవిధంగా కరోనా మహమ్మారి నేపధ్యంలో మోడిపై స్థూలంగా ప్రజలేమనుకుంటున్నారో  తెలుస్తుంది.

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఆసక్తి రేపుతుంది 

తెలంగాణాలో జరిగిన ఒకే ఒక అసెంబ్లీ ఉపఎన్నిక దుబ్బాక. మామూలుగా నయితే దీనికి అంత ప్రాధాన్యత వుండకూడదు. కాకపోతే ఇది రాష్ట్రంలో కెసిఆర్ కి ఏ పార్టీ పోటీగా వుండబోతుందనేది నిర్ణయించే ఎన్నికగా ప్రజలు చూస్తున్నారు. బిజెపి గెలిచినా ఓడినా ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మామూలుగానయితే బిజెపి ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ మూడో స్థానమే. కాని ఈసారి తెరాసతో నువ్వా నేనా అన్నంత స్థాయిలో డీ కొట్టింది. ఇది నైతికంగా బిజెపికి విజయం. ఇప్పుడు చూడాల్సింది ఫలితం ఈ మీడియా హైప్ ని ప్రతిబింబిస్తుందా లేదా అనేదే. గెలిచినా ఓడినా మంచి పోటీ ఇస్తే చాలు బిజెపి భవితవ్యం తెలంగాణాలో నిలబడినట్లే. అదే సమయంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లే. ఆతర్వాత జరిగే జి హెచ్ ఎంసి ఎన్నికల్లో ఎటూ పోటీ తెరాస, బిజెపిల మధ్యనే వుంటుంది. అదే దుబ్బాకలో గనక రెండో స్థానంలో నిలబడితే కాంగ్రెస్ నిలదొక్కుకొని భవిష్యత్తు పై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సర్వేల ప్రకారం ఆ ఛాన్సు లేనట్లే కనబడుతుంది. కాబట్టి మనకు తెలంగాణా ఉపఎన్నిక కూడా ముఖ్యమే.

బీహార్ ఎన్నికలు మోడీకి అతి ముఖ్యం 

ఉత్తర ప్రదేశ్ తర్వాత హిందీ ప్రాంతాల్లో రెండో అతి పెద్ద రాష్ట్రం బీహార్. దేశ రాజకీయాల్లో బీహార్ ఎప్పుడూ ప్రధానపాత్ర పోషించింది. దేశానికి మొదటి రాష్ట్రపతిని అందించింది బీహార్ నే. సోషలిస్టు రాజకీయాలకు జన్మ భూమి, కర్మ భూమి. జయప్రకాష్ నారాయణ్ ఈ రాష్ట్ర ముద్దు బిడ్డనే. రామమనోహర్ లోహియా రాజకీయాలకు కర్మ భూమి బీహార్ నే. సోషలిస్టు రాజకీయాల్లో నాయకులనదగ్గ జార్జ్ ఫెర్నాండేజ్, శరద్ యాదవ్ లాంటి వారు ఆ రాష్ట్రానికి చెందక పోయినా అక్కున చేర్చుకున్న రాష్ట్రం బీహార్. మండల రాజకీయాలకు కేంద్ర భూమి బీహార్ నే. కర్పూరీ ఠాకూర్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లను నాయకులుగా తీర్చిదిద్దింది బీహార్ నే. అంతటి ప్రాముఖ్యతగల బీహార్ అసెంబ్లీలో ఎవరు గెలవబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

లాలూ ప్రసాద్ యాదవ్ 15 సంవత్సరాలు, నితీష్ కుమార్ 15 సంవత్సరాలు ఇక్కడ రాజ్యమేలారు. ఇప్పుడు నాలుగోసారి నితీష్ కుమార్  ప్రజారంగంలో పరీక్షకు దిగాడు. ఎవరికైనా 15 సంవత్సరాలు ఎక్కువే. మనదేమీ కమ్యూనిస్టులు, నియంతలు పాలించే స్వామ్యం కాదు కదా. జీవితకాలం పరిపాలించాలనే కోరికలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బిజెపి చలనశీలంగా ఆలోచించటం మానేసింది. మహారాష్ట్రలో శివసేన బెదిరింపులకు లొంగి వున్న స్థానాలు వదులుకొని శివసేనతో పొట్టు పెట్టుకుంది. ఫలితం అనుభవిస్తుంది. ఝార్ఖండ్ లో కొన్ని సీట్ల కోసం పొత్తు వదులుకొని ప్రజారంగం లో చతికిల పడింది. మరి బీహార్ లో వ్యతిరేకతను మూటగట్టుకున్న సమయంలో నితీష్  కుమార్ ని భుజాన పెట్టుకొని మోస్తుంది. రెండో వైపు తేజస్వి యాదవ్ తన తండ్రి సాంఘిక న్యాయం వేదికనుంచి వైదొలగి ఆర్ధిక న్యాయం వైపు మళ్ళి యువతని ఆకర్షించాడు. ఈ ఎన్నికల్లో నితీష్ కంటే తేజస్వి యాదవ్ నే ప్రజలనాడిని పట్టుకోవటంలో ముందంజలో వున్నాడు. కాని బీహార్ ఎన్నికలు కుల సమీకరణాలను అధిగమించి ఓటెయ్యగలుగుతుందా అనేది వేచి చూడాలి.  ఒకవేళ అదే జరిగినా కాంగ్రెస్ తేజస్వి ఆశలకు గండి కొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేసి తన బలం కన్నా ఎక్కువ స్థానాల్ని దక్కించుకుంది. అదేలేకపోతే ఇప్పుడు ఎన్డిఎ తో జతగట్టిన విఐపి, హం పార్టీలు మహా కూటమిలో వుండి వుండేవి.  నిజంగా జనంలో అంత గాలి వుంటే కాంగ్రెస్ ని కూడా కూటమి బయటపడేస్తుందా? చివరకు కాంగ్రెస్ తేజస్వి యాదవ్ కి గుదిబండా లేక విలువ కట్టగలిగే సంపదా అనేది తేలాల్సి వుంది. ఇందులో చిరాగ్ పాశ్వాన్, ఒవైసీ కూటములు ఎంతవరకు ఓట్లు చీల్చబోతున్నాయి? బీహార్ ఎన్నికల్లో ఆర్ జే డి, బిజెపి, జనతా దళ్ (యునైటెడ్) లు మూడు ప్రధాన పార్టీలు ఇందులో ఏ ఇద్దరూ జట్టు కడితే వాళ్ళ వైపే ఇంతవరకూ విజయం వరించింది. కానీ ఈసారి ఏమవుతుందోనని ఆసక్తి నెలకొంది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వచ్చే ఛాన్స్ ఉందా అనికూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ముఖ్యంగా ఆక్సిస్ మై ఇండియా పోల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో .

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular