ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ పాలన తరహాలోనే ఉత్తర ప్రదేశ్ వాసులు కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరైన సౌకర్యాలు, వసతులు లేక ఢిల్లీకి వస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వారి వలసలను ఆపేలా రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైద్య అవసరాలు, విద్య తదితర సౌకర్యాలపై ఉత్తరప్రదేశ్ వాసులు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు అన్ని పార్టీలో ద్రోహం చేస్తున్నాయని, అవినీతి విషయంలో ఒకదానికంటే మరొకటి మించిపోయిందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలునిజాయితీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఢిల్లీలో తమ ప్రభుత్వం నిజాయితీ పాలన అందిస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి మంచి రోజులు రానున్నాయని, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసి తమ పార్టీ సత్తా చూపిస్తామన్నారు.